- తప్పుడు థంబ్ నెయిల్స్ పెడితే అంతే సంగతులు
YouTube Warning: కొంత కాలంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సోషల్ మీడియా వైపు దృష్టి సారిస్తున్నది. ఇందులో ప్రధానంగా ఆదాయం సమకూర్చుతున్నది మాత్రం యూ ట్యూబ్ అని చెప్పవచ్చు. అటు ఆదాయం పాటు ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు యూట్యూబ్ చక్కని వేదికగా నిలుస్తున్నది. టీవీ చానల్స్ కు వివిధ రూపాల్లో ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నది. టీవీ చానళ్లు కూడా పోటాపోటీగా యూ ట్యూబ్ లో తమకంటూ చానళ్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఎంటర్టైన్మెంట్, కుకింగ్, ట్రావెలింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ ఇలా పలు విభాగాల్లో చానళ్లను ఏర్పాటు చేసి..ఎంతో కొంత ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి.
అయితే కొన్ని తెలుగు చానళ్లు ఇటీవల కాలంలో తిక్క తిక్క థంబ్ నెయిల్స్(Thumbnail) పెట్టి వీక్షకులకు సరైన సమాచారం అందించడం లేదని.. యూజర్ విలువైన సమయాన్ని పక్కదారి పట్టిస్తున్నాయని యూట్యూబ్ చాలా రోజులుగా గమనిస్తున్నది. ఇలాంటి కారణాల రీత్యా ఇటీవల తెలుగు న్యూస్ చానళ్ల రీచ్ ను యూ ట్యూబ్ చాలా వరకు తగ్గించేసింది. షాకింగ్, బ్రేకింగ్, సంచలనం, ఉత్కంఠ ఇలాంటి పేర్లతో థంబ్ నెయిల్స్ పెట్టడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. ఇది తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నదని, దీంతో వీక్షకుల నుంచి తమకు ఫిర్యాదులు వస్తున్నాయని యూట్యూబ్ పేర్కొంటున్నది.
అడ్డగోలు సమాచారం.. తప్పుడు సందేశాల వ్యాప్తి వంటివి పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు యూట్యూబ్ కొన్ని నిబంధనలను కఠినతరం చేస్తున్నదని కొంత కాలంగా చర్చ అయితే జరుగుతున్నది. ఇక ఇదే సమయంలో నాణ్యమైన కంటెంట్ అందించే ఇండి విజువల్ క్రియేటర్లకు యూట్యూబ్ మరింత ప్రాధాన్యం ఇస్తుందని టాక్ వినిస్తున్నది.
అవి తొలగించాల్సిందే
తెలుగులో వేలాదిగా ఉన్న న్యూస్ చానళ్లు అడ్డగోలు థంబ్ నెయిల్స్ పెట్టి.. లక్షలాదిగా వీడియోలను యూట్యూబ్‌లో పెట్టేశాయి. ఇందులో థంబ్ నెయిల్స్ కు, లోపల ఉన్న కంటెంట్‌కు అసలు ఏమాత్రం సంబంధం ఉండడం లేదు. పైగా అందులో అత్యంత దారుణమైన సంభాషణలు.. ఇతరత్రా ఉంటున్నాయి. దీంతో అవి క్లిక్ బైట్లు గా ఉన్నాయని యూ ట్యూబ్ వెల్లడిస్తున్నది. అలాంటి వీడియోలను తొలగించాలని తెలుగు న్యూస్ చానల్స్ కు యూట్యూబ్ సూచనలు జారీ చేసింది. ఆ తర్వాతే రీచ్ ఇస్తామని తెలుగు యూ ట్యూబ్ చానళ్లకు స్పష్టం చేసింది. ఇందు కోసం ఈనెల 28న తెలుగు న్యూస్ చానళ్లకు వర్చువల్ సెషన్ నిర్వహించనున్నది. ఇప్పటికే అన్ని న్యూస్ యూ ట్యూబ్ చానళ్లకు సమాచారం పంపించేసింది.
‘కొంతకాలంగా తప్పుడు సమాచార వ్యాప్తి దర్జాగా సాగుతున్నది. ఇది వీక్షకుల అభిప్రాయాన్ని ప్రభావితం చేస్తున్నది. సమాచార వ్యాప్తిలో.. సమాచార విప్లవంలో వీక్షకులకు అన్ని సరైనవే తెలియాలి. ఈ టెక్నాలజీ కాలంలో తప్పుడు సమాచారానికి ఏ మాత్రం తావులేదు. ఇష్టానుసారమైన వ్యాఖ్యలకు చాయిస్ లేదు. ఒక లక్ష్యంతో చేసుకునే వారికి ఒక వేదికలాగా ఉంటుంది. వారి వారి సొంత ఏజెండాలకు ఇది ఏమాత్రం రెడ్ కార్పెట్ వేయదు’ అంటూ యూ ట్యూబ్ తెలుగు న్యూస్ చానల్స్ కు పంపిన హెచ్చరికలో పేర్కొందని సాంకేతిక నిపుణులు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు. అంటే ఇకపై అడ్డగోలు థంబ్ నెయిల్స్ పెడితే.. యూ ట్యూబ్ ఏమాత్రం ఊరుకోబోదని స్పష్టమవుతున్నది.