Maisamma Jathara: జిల్లాలోని మందమర్రి మండలం బొక్కలగుట్ట ప్రాంతంలో ఈనెల 14వ తేదీ నుండి జరిగే గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ ఛాంబర్ లో జాతర కమిటీ ప్రతినిధులతో కలిసి జాతర గోడ ప్రతులను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 14, 15, 16 తేదీలలో జరిగే మైసమ్మ జాతరను ఘనంగా నిర్వహించాలని తెలిపారు. జాతరకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని, శాంతి భద్రతల పరిరక్షణ దిశగా బందోబస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయక్ కోడ్ హక్కుల పరిరక్షణ కమిటీ ప్రతినిధులు పెద్ది భార్గవ్ పటేల్, గంజి రాజన్న ఆదివాసీ నాయకులు, సాంస్కృతిక కళాభివృద్ధి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మేస్నేని రాజన్న, మనుమతుల కుమార్ తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల
