- 2024లో 8,167 కేసులు నమోదు
- గతేడాదితో పోల్చితే తగ్గిన 1,257 కేసులు
- రామగుండం సీపీ శ్రీనివాస్
- వార్షిక నివేదిక విడుదల
Ramagundam CP : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని సీపీ శ్రీనివాస్ వెల్లడించారు. 2024లో మొత్తం 8,169 కేసులు నమోదైనట్లు సీపీ ప్రకటించారు. రామగుండం కమిషనరేట్‌లో సీపీ సోమవారం మీడియాతో సమావేశయ్యారు. 2024 క్యాలెండర్‌లో వార్షిక కేసుల వివరాలు వెల్లండించారు. 2023 క్యాలెండర్ కేసులతో పోల్చితే మొత్తంగా 1,257 కేసులు తగ్గుముఖం పట్టినట్లు వెల్లడించారు. కమిషనరేట్ పరిధి మంచిర్యాల జోన్‌లో 4,455 కేసులు, పెద్దపల్లి జోన్‌లో 3,712 కేసులు నమోదైనట్లు వివరించారు. ఇందులో దర్యాప్తులో ఉన్న వాటితో పాటు, కోర్టు పెండింగ్ కేసులు, ఇతర కేసులు ఉన్నట్లు వెల్లడించారు.
నిస్పక్షపాతంగా ఎన్నికల బందోబస్తు
ఈ క్యాలెండర్‌లో పోలీసులు మరింత సమర్థవంతంగా, బాధ్యతయుతంగా వ్యవహరించాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసిన తేది నుంచి పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ వరకు ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతమైన, స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణపై పటిష్టంగా ఎన్నికల బందోబస్తును విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు.
వివిధ కేసుల్లో రూ.12,23,99,450 జరిమానా
జరిమాన, రుసుం వసూలు కేసుల్లో ఈ చాలన్ కేసుల్లో రూ.12,23,99,450 జరిమానా విధించినట్లు తెలిపారు. డ్రంక్‌అండ్‌డ్రైవ్‌లో రూ.76, 99,329, 141 గ్యాంబ్లింగ్ కేసుల్లో 928 మందిపై కేసు నమోదు చేసి వారి నుంచి రూ. 77, 25,461లు సీజ్ చేశామని చెప్పారు. గుడుంబా, మద్యం, ఇసుక అక్రమ తరలింపు, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, నకిలీ విత్తనాల కేసుల్లో భారీగా జరిమానాలు, వాహనాలు, విత్తనాలు సీజ్ చేశామని వివరించారు. టాస్క్‌ఫోర్స్ దాడుల్లో రూ.1,27,38,249 ఆస్తులు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. లోక్ అదాలత్ ద్వారా 42,762 కేసులను పరిష్కరించామని చెప్పారు.
పల్లెనిద్రతో ప్రజలతో మమేకం
ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాలు, మహిళ రక్షణలో షీటీమ్ చేపట్టిన సమర్థవంతమైన విధులు, పల్లెనిద్ర కార్యక్రమంతో ప్రజలతో మమేకమయ్యామని, వారి సమస్యల పరిష్కారం, ప్రయోగాత్మంగా చేపట్టిన ఆపరేషన్ గరుడతో అసాంఘిక శక్తుల నిర్మూలన, నేరాల నియంత్రణ పనులు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో వైద్యశిబిరాల ఏర్పాటు, ఏరియా డామినేషన్ కార్యకలాపాలు చేపట్టామని వివరించారు. ఇక్కడ పెద్దపల్లి, మంచిర్యాల డీసీపీలు చేతన, భాస్కర్, అడ్మిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, గోదావరిఖని ఏసీపీ రమేశ్, రామగుండం ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సుందర్‌రావు, ఆర్‌ఐలు దామోదర్, మల్లేశ్ ఉన్నారు.
శాంతియుత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలి
డిసెంబర్ 31 వేడుకలు ప్రజలు ప్రశాంతమైన, శాంతియుత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నిర్వహించుకోవాలని రామగుండం సీపీ పేర్కొన్నారు. అర్థరాత్రి 12.30 గంటలకు వేడుకలు ముగించుకోవాలని, న్యూ ఇయర్ వేడుకలకు పోలీసు అనుమతి తప్పనిసని పేర్కొన్నారు. వేడుకల్లో అశ్లీల నృత్యాలకు అనుమతి లేదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్కెస్ట్రా, డీజేలు, మైకుల వినియోగం, బాణసంచా నిషేధమన్నారు. మద్యం దుకాణాలు, వైనషాప్స్, బార్‌అండ్ రెస్టారెంట్లు ప్రభుత్వ అనుమతి సమయపాలన పాటించాలన్నారు. రాత్రి 10నుంచి ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడుతామని తెలిపారు. పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి బైండోవర్ చేస్తామని వెల్లడించారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల