Student Sucide : తను ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోలేననే భయంతో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలోని రాంనగర్ లో చోటుచేసుకుంది. సీసీసీ నస్పూర్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
చిలువేరి దేవేందర్, జ్యోతి దంపతులు జీవనోపాధి నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్టం రాజమండ్రి అమలాపురంలోని లిక్కర్ గోదాంలో కూలీలుగా పని చేస్తు కూతురు యోగిత(16)కు మంచి విద్యను అందించాలనే లక్ష్యంతో నస్పూర్ పట్టణం రాంనగర్ లో ఉంటున్న యోగిత అమ్మమ్మమోతుకూరి కొమురమ్మ, మేనమామ మోతుకూరి శ్రీనివాస్ ల వద్ద ఉంచి చదివిస్తున్నారు. తల్లిదండ్రుల ఆకాంక్ష, తను ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోలేననే భయంతో శుక్ర వారం అర్ధరాత్రి అందరు పడుకున్న తరువాత ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు సీసీసీ నస్పూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై నెల్కి సుగుణాకర్ ఈ మేరకు
కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
మమ్మి.. డాడీ.. నన్ను క్షమించండి…
నస్పూర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న యోగిత చదువులోనూ, ఆటపాటలోనూ చురుకుగా ఉండేదని పాఠశాల యాజమాన్యం, తోటి విద్యార్థులు పేర్కొంటున్నారు. సీఎం కప్ లో సైతం యోగిత పలు బహుమతులు అందుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లిదండ్రులకు దూరంగా అమ్మమ్మ, మేనమామ వాళ్ళ ఇంట్లో ఉంటు చదువుకుంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా అందరిని కలచివేసింది.
సూసైడ్ నోట్ లో… నన్ను క్షమించండి మమ్మీ.., డాడీ… నేను ఒక గోల్ అనుకున్నా కానీ నా వల్ల అయితలేదు. మీ కోసం నేను ఎంతో చేయాలని అనుకున్న కానీ అది చేయకుండా వెళ్తున్న.. అందరితో కలిసి ఉండాలని ఉంది, కానీ ఉండలేకపోతున్నా… మీరు కూడా నాపై ఎంతో ఆశలు పెట్టుకున్నారు మమ్మీ.. భవిష్యత్తుపై ఎంతో నమ్మకం పెట్టుకున్న మీకు ఇలా అన్యాయం చేస్తానని అనుకోలేదు.. మీరు నన్ను తిట్టుకున్నా నాకు ఇది తప్ప వేరే మార్గం లేదంటూ రాసిన సూసైడ్ నోట్ అందరిని కలచి వేసింది.
తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాననే బాధనో.. లేకు చదువు ఒత్తిడో గానీ అమాయకురాలు ప్రాణాలు కోల్పోయింది. అభం శుభం తెలియని చదువుల తల్లి లోకాన్ని వీడింది.
-శెనార్తి మీడియా, మంచిర్యాల