- బస్తాకు 2 రూపాయలు లారీ మామూలు…
- వర్షం పడితే లారీకి రూ. 5 వేలు ఇవ్వాల్సిందే…
- నష్టపోతున్న రైతాంగం
- చోద్యం చూస్తున్న అధికారులు
Paddy Centres :జిల్లాలో ఒకవైపు ధాన్యం కొనుగోలు సాగుతుంటే మరోవైపు దళారులు చేతివాటం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి దళారులు యదేచ్ఛగా ధాన్యాన్ని తీసుకెళుతున్నారు. అది కూడా తక్కువ ధరకే తీసుకెళుతుండడంతో రైతులు క్వింటాలకు మూడు నుంచి నాలుగు వందల రూపాయలు నష్టపోతున్నారు. ఇదంతా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు దగ్గరుండి జరుపుతున్నట్లు సమాచారం.
వర్షం పడితే లారీకి రూ. 5 వేలు…
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు లారీలు కేటాయిస్తే మొదట సజావుగా జరుగుతున్న తర్వాత డబ్బుల మయం అవుతుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు కేంద్రానికి లారీ వస్తే లోడింగ్ కోసం రైతు నుంచి ఒక్కో బస్తాకు రెండు రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇదే కాక తప్పిపోయి వర్షం పడింది అంటే చాలు లారీ కావాలంటే ఐదు వేలు ఇస్తేనే ఆ కేంద్రాలకు లారీ వస్తుంది. రహదారి వెంట ఉన్న కేంద్రాల్లో ఈ సమస్య లేకపోయినప్పటికీ మారుమూల గ్రామాల్లోని కేంద్రాల్లో ఇదే ప్రధాన సమస్యగా మారింది. మీ ఊరికి రావాలంటే రోడ్డు సరిగా లేదు, రోడ్డు వెంట మొత్తం విద్యుత్ తీగలే ఉంటున్నాయని, తదితరాలను సాకుగా చూపి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఒక కేంద్రంలో ఇలా నడుస్తుంది అంటూ మిగతా కేంద్రాలకు వచ్చే లారీ డ్రైవర్ లు సైతం డబ్బులు ఇస్తేనే లారీ వస్తది లేదంటే లేదు అని చెబుతుండడంతో చేసేది ఏమీ లేక రైతులు డబ్బులు ఇచ్చి ధాన్యాన్ని పంపిస్తున్నారు. ఇదంతా సంబంధిత శాఖ అధికారులకు తెలిసిన విషయమే కాగా ట్రాన్స్ పోర్ట్ లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ‘మామూలు’గా ఉంటున్నారు. కోటపల్లి, చెన్నూరు, వేమనపల్లి, నెన్నేల తదితర మండలాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది.

నష్టపోతున్న రైతాంగం
కొనుగోలు కేంద్రాలలో సరైన సమయంలో దాన్యం మిల్లులకు చేరకపోతుండడంతో ఇది దళాలకు వరంలా మారింది. వర్షం పడితే బస్సు 5 నుండి 6 కిలోలు కోతలు ఉంటాయని చెబుతూ రైతుల వద్ద క్వింటాలుకు మూడు నుండి 400 రూపాయల తక్కువకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం క్వింటాలుకు సాధారణ రకానికి రూ. 2300 చెల్లిస్తుంటే దళారులు క్వింటాలకు రూ. 1900 నుంచి రూ. 2000 చెల్లిస్తూ తీసుకెళ్తున్నారు. దళాల్లో ఎవరో కాదు పక్క కొనుగోలు కేంద్రం నిర్వాహకులే కావడం గమనార్హం. ఒక కేంద్రం నిర్వాహకుడు మరో కేంద్రంలో దళారుడి అవతారం ఎత్తి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వం ఇచ్చిన 40 కిలోల బ్యాగులో మిల్లులకు దాన్యం తరలిస్తున్నాడు. దీనిని అడ్డుకోవడంలో సంబంధిత శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారా..! లేదా తెలిసే జరుగుతుందా..! అనేది తెలియాల్సి ఉంది.
20 రోజులైతంది..

ఐకేపీ సెంటర్ లో వడ్లు ఆరబోసి 20రోజుల అయితుంది. వడ్లు జోకమంటే అప్పుడు ఇప్పుడు అంటూ దాట వేస్తున్నారు. వానల భయానికి కొందరు రైతులు ప్రైవేట్‌కు, కొందరు రైతులు అప్పు ఇచ్చిన దళారులకు వడ్లు అమ్ముకుంటున్నారు.
పైకారావు గోపాల్, బొప్పారం గ్రామ, కోటపల్లి మండలం
లారీలు వస్తలేవు..

నేను సెంటర్ కు వడ్లు తీసుకువచ్చిన 20 రోజల తర్వాత మా వడ్లు కాంటా పెట్టిండ్రు. మొన్నటి దాకా లారీలు రాక వడ్లు జోకలేదు. కాంటా చేసిన బస్తాలేమో ఇంకా మిల్లుకు తీసుకపోలేదు. వానొస్తే వడ్లు నీళ్ల పాలు అయితయని భయపడుతున్నం. లారీలు రావాలంటే రోడ్డు మార్గం కూడా సరిగా లేదు. దీనిని ఆసరా చేసుకొని ప్రైవేట్ వ్యాపారులు అగ్గువకు తీసుకుంటున్నరు.
మంద మల్లయ్య ,బొప్పారం గ్రామం, కోటపల్లి మండలం
-శెనార్తి మీడియా, మంచిర్యాల