- డీసీపీ ఎగ్గడి భాస్కర్
ASSURANCE CENTER : హింస, వేధింపులు, అన్యాయానికి గురైన మహిళలు, బాలికలకు అండగా ‘భరోసా’ కేంద్రం ఉందని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. జిల్లాలో ‘భరోసా’ కేంద్రం ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా గురు వారం ఏర్పాటు చేసిన వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. భరోసా కేంద్రాల ద్వారా బాధిత మహిళలు, బాలికలకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని, లైంగిక వేధింపులు, గృహ హింస బారిన పడిన వారిని మానసికంగా, చట్టపరంగా ఆదుకుంటూ న్యాయం జరిగే వరకు అండగా ఉంటున్నామన్నారు. తెలంగాణలో భరోసా కేంద్రాలు దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తున్నాయన్నారు.

హింసకు గురైతే మౌనంగా ఉండొద్దు.. భరోసా సెంటర్‌ను ఆశ్రయించండి..!
భరోసా సెంటర్ ప్రధాన లక్ష్యం బాధితులకు భద్రత, న్యాయం, ఆత్మవిశ్వాసం కల్పించడమేనని డీసీపీ ఎగ్గడి భాస్కర్ పేర్కొన్నారు. కేసు నమోదైన సమయం నుంచి భరోసా సిబ్బంది బాధితులకు అండగా ఉంటూ, వారి మానసిక స్థితిని బలోపేతం చేస్తారన్నారు. భరోసా కేంద్రాల సేవలను మరింత మందికి తెలియజేయడం కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా డీసీపీ బాధితులతో మాట్లాడి వారికి భరోసా కల్పిస్తూ, అవసరమైన సహాయాన్ని అందజేశారు. అనంతరం మంచిర్యాల ఏసీపీ భాస్కర్ తో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ఆర్. ప్రకాశ్, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ నరేష్ కుమార్, షీ టీం ఎస్ఐ హైమ, భరోసా సిబ్బంది, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల :