Singareni CMD:సింగరేణి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరాం, డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్. వి. సూర్యనారాయణ, ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ కె. వెంకటేశ్వర్లు శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7, ఆర్కే న్యూటెక్, ఆర్కే 6, ఆర్కే 5, శ్రీరాంపూర్ సిహెచ్పి, ఓసి గనులను బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఎండీ ఎన్. బలరాం మాట్లాడుతూ… సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు తప్పనిసరిగా ఎనిమిది గంటల విధులను నిర్వహించాలని, భారీ యంత్రాల వినియోగ సమయాన్ని పెంచాలని సూచించారు. ఉద్యోగులు క్రమశిక్షణతో విధులకు హాజరవుతూ, నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్కే – 7, ఆర్కే న్యూటెక్, ఆర్కే- 6, ఆర్కే – 5, శ్రీరాంపూర్ సిహెచ్పి, ఓసి గనుల సూపర్వైజర్లు, మైనింగ్ సిబ్బంది, కోల్ కట్టర్, సపోర్ట్ మెన్, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో సీఎండీ మాట్లాడి, వారికి అవసరమైన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
- మహిళా ఉద్యోగులకు ప్రోత్సాహం
సంస్థలో మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను అందించేందుకు సంస్థ కట్టుబడి ఉందని సీఎండీ ఎన్. బలరాం వెల్లడించారు. ఉత్పత్తి, ఉత్పాదకతలో మహిళా ఉద్యోగులు తమ పాత్రను మరింత విస్తరించాలని, భూగర్భ గనుల్లో కూడా విధులు నిర్వర్తిస్తూ, సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. మహిళా ఉద్యోగులు ఏపీ ఆపరేటర్లుగా పనిచేసేందుకు అవకాశం ఉందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
- 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం
ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలని సీఎండీ ఎన్. బలరాం స్పష్టం చేశారు. భూగర్భ గనుల్లో విధులు నిర్వహించే ప్రతి ఒక్కరు రక్షణతో కూడిన ఉత్పాదకత పెంచాలని సూచించారు. ఆర్కే న్యూటెక్ భూగర్భ గనిని పరిశీలించిన ఆయన, మైనింగ్ ఉద్యోగులతో ముఖాముఖి చర్చ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జనరల్ మేనేజర్ టి. శ్రీనివాస్, ఎస్వో టు జిఎం ఎన్. సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు కె. వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్కే- 7 గ్రూప్ ఏజెంట్ కె. రాజేందర్, ఆర్కే 5 అండ్ 6 గ్రూప్ ఏజెంట్ శ్రీధర్, డిజిఎం పర్సనల్ పి. అరవింద్ రావు, ఆర్కే న్యూటెక్ మేనేజర్ స్వామి రాజు, సిహెచ్పి ఇన్చార్జి డిజిఎం చంద్రలింగం, ఆర్కే-7 మేనేజర్ తిరుపతి, ఆర్కే-6 మేనేజర్ ఈ. తిరుపతి, ఆర్కే-5 మేనేజర్ సుధీర్ కుమార్, సీనియర్ పిఓ పి. కాంతారావు, గుర్తింపు సంఘం యూనియన్ నాయకులు ముష్క సమ్మయ్య, వీరభద్రయ్య, వివిధ గనుల సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల