Amber kishore jha: రామగుండం పోలీస్ కమిషనరేట్ కొత్త పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంచిర్యాల(Mancherial PS) ఠాణాను బుధవారం తనిఖీ చేశారు. స్టేషన్‌లో నమోదైన కేసుల వివరాలు, స్టేషన్ నిర్వహణ, అధికారుల పనితీరు పై సమీక్షించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు. మంచిర్యాల పట్టణం భౌగోళికంగా కీలకమైందని, కాబట్టి శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. నేరాల నియంత్రణ చర్యలు, రౌడీ షీటర్లపై వేటు, కౌన్సెలింగ్, ప్రజలకు అందుతున్న పోలీసు సేవల నాణ్యతపై అధికారులతో చర్చించారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పని చేస్తున్నదని తెలిపారు. రాత్రి పెట్రోలింగ్ పటిష్ఠంగా కొనసాగిస్తూ, పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రజల భద్రతను కాపాడేందుకు పోలీస్(Police) బృందాలు నిరంతరం పని చేస్తాయని వివరించారు. పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. సీపీ వెంట మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్(Mancherial DCP), పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కే నరేష్ కుమార్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల