ricemill_1
శ్రీరాంపూర్ జీఎం సూర్యనారాయణకు వినతి పత్రం ఇస్తున్న మాజీ ఎంపీటీసీలు

SCCL TENDERS : రైస్ మిల్లు బీటీ రోడ్డు నిర్మాణం కోసం…

  • టెండర్లు పిలిచిన సింగరేణి
  • రద్దు చేయాలని వినతి చేసిన గ్రామస్తులు

SCCL TENDERS : మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం రామారావు పేట శివారులో ఒక వ్యక్తి తన వ్యక్తిగత వ్యాపార లాభం కోసం కోట్ల రూపాయలతో నిర్మించుకుంటున్న రైస్ మిల్లుకు కొంత మంది సింగరేణి అధికారుల మద్దతుతో బీటీ రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిపించుకున్నట్లు సమాచారం. సింగరేణిలో తన జేబులోకి పది రూపాయలు వస్తే సంస్థకు వంద రూపాయలు నష్టమైనా పర్వాలేదనుకునే కొంత మంది అధికారులు మామూళ్లకు ఆశ పడి ఈ రోడ్డు ఎవరికి, ఎంత వరకు ఉపయోగపడుతుందని ఆలోచించకుండా దాదాపు రూ. 95 లక్షల విలువ జేసే బీటీ రోడ్డు నిర్మాణానికి సింగరేణి టెండర్లు పిలవడం పట్ల పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇది పూర్తిగా సింగరేణి నిధులను దుర్వినియోగం చేయడమే అవుతుందని పలువురు సీనియర్ సింగరేణి కార్మిక సంఘ నాయకులు, ముంపులో సర్వస్వం కోల్పోయిన ప్రజలు వాపోతున్నారు.

ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్దిని మరచి…
సింగరేణి ప్రభావిత ప్రాంతాలైన జైపూర్ మండలంలోని ఇందారం, రామారావు పేట, టేకుమట్ల గ్రామాల్లో ప్రజలు పలు సమస్యలు ఎదుర్కొంటున్న పట్టించుకోని సింగరేణి అధికారులు ఒకరి స్వలాభం కోసం లక్షల రూపాయలు వెచ్చించడం పట్ల సింగరేణి అధికారుల పనితీరు ఎలా ఉందో కనబడుతుంది. పలుమార్లు సమస్యలపై శ్రీరాంపూర్ సింగరేణి జీఎం దృష్టి కి తీసుకువచ్చినా ఏనాడు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే సింగరేణి అధికారులు ఒక వ్యక్తి స్వార్ధ ప్రయోజనాల కోసం మాత్రం ఆఘమేఘాలపై రోడ్డు కోసంటెండర్లు పిలవడం పట్ల బాధిత ప్రాంత ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రద్దు చేయాలని వినతి చేసిన గ్రామస్తులు
సింగరేణిలో కొంతమంది అధికారుల స్వార్ధ ప్రయోజనాల కోసం పిలిచిన ఈ టెండర్లను వెంటనే రద్దు చేయాలని ఇందారం మాజీ ఎంపిటీసి – 2 అరికె స్వర్ణ సంతోష్ యాదవ్, రామారావు పేట మాజీ ఎంపిటీసి పెద్దల బాపులు శని వారం శ్రీరాంపూర్ జీఎం సూర్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ నిధులను ఇందారం, రామారావు పేట గ్రామాల అభివృద్ధికి ఉపయోగించాలని కోరారు. సింగరేణి డంపు యార్డుకు వాహనాలు నడిచేందుకు రోడ్డు సౌకర్యం ఉందని, అయినా రోడ్డు పేరిట ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయవద్దని కోరారు. ఈ విషయంపై చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి దృష్టికి గ్రామస్తులు తీసుకువెళ్లినట్లు తెలిసింది. అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

– శెనార్తి మీడియా, మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *