కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని విన్నపం
Singareni CMD : జైపూర్ పవర్ ప్లాంట్‌లో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ యూనియన్ (బీఎంఎస్) ప్రతినిధులు.. సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్‌ను కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని చైర్మన్ కార్యాలయంలో కలిశారు. బిఎంఎస్ జాతీయ సేఫ్టీ కమిటీ సభ్యులు, బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్ కొత్త కాపు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సీఎండీని కలిశారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై మెమొరాండం అందజేశారు. ఈ సమావేశంలో కార్మికుల పలు ప్రధాన సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.
గతంలో డిప్యూటీ సెంట్రల్ లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన ఒప్పందం ప్రకారం క్యాంటీన్ సదుపాయం వెంటనే ప్రారంభించాలనీ, అలాగే భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జైపూర్ పవర్ ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు తగిన ప్రమోషన్లు కల్పించడంతో పాటు, ప్లాంట్‌లో విధులు నిర్వహించడానికి ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.
విధుల్లో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలనీ, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్లాంట్ కార్మికుల కోసం ప్రత్యేకంగా ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా, బోనస్ చట్టం 1965 ప్రకారం ప్రతి కార్మికుడికి వార్షిక బోనస్ చెల్లించాలని, రామగుండం ఎన్టీపీసీ కాంట్రాక్ట్ ఉద్యోగుల మాదిరిగా ప్రతి కార్మికుడికి రూ. 5,000 అలవెన్సు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పవర్ మేక్ ప్రైవేట్ యాజమాన్యం అమలు చేస్తున్న క్యాజువల్ లీవ్, సిక్ లీవ్, వేతన లీవ్, పీహెచ్డీలను సివిల్ డిపార్ట్‌మెంట్ కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వర్తింపజేయాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యంతో చర్చలు జరిపి త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని చైర్మన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ ప్రధాన కార్యదర్శి దుస్స భాస్కర్, పులి రాజారెడ్డి, మండ రమాకాంత్, బోడకుంట శ్రీధర్, పెద్దిరెడ్డి కిషన్ రెడ్డి, శివకృష్ణ, చిలకని వెంకటేష్, కె. సతీష్ తదితరులు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల :