- సింగరేణిలో తొలిసారిగా మహిళా రెస్క్యూ బృందం ఏర్పాటు
Singareni: సింగరేణి 136 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా మహిళా ఉద్యోగులు రెస్క్యూకు అడుగుపెట్టారు. శిక్షణ పూర్తి చేసిన 13 మంది మహిళా అధికారులతో ఏర్పాటైన తొలి మహిళా రెస్క్యూ బృందానికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు.శ్రీశైలం, పాశమైలారం, తమిళనాడు వంటి ప్రమాదాలలో సేవలందించిన సింగరేణి రెస్క్యూ బృందాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. దీనిని మరింత బలోపేతం చేయడంలో భాగంగా రామగుండం-2 ప్రాంతంలోని మైన్స్ రెస్క్యూ స్టేషన్‌ను అత్యుత్తమ శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు యాజమాన్యం కృషి చేస్తోంది.

సమర్థవంతమైన శిక్షణ
సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ఆదేశాలతో జీఎం శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో ఈ మహిళా రెస్క్యూ బృందం ఏర్పాటైంది. 14 రోజులపాటు అన్ని రకాల శిక్షణలతో మెరుగైన ప్రావీణ్యం కలిగించారు. మహిళా అధికారులు తమ సామర్థ్యాన్ని పూర్తిగా నిరూపించుకున్నారు. మరో బృందం ఏర్పాటుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.
జాతీయ స్థాయికి సిద్ధం
ట్రైనర్లు తిరుపతి, కిషన్ రావు, సందీప్, సాజిద్ అలీల శిక్షణలో మహిళా బృందం అవిశ్రాంతంగా సాధన చేసింది. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ రెస్క్యూ పోటీలలో పాల్గొనేలా సన్నద్ధమవుతోంది. రాష్ట్రం, కేంద్ర విపత్తు బృందాలకు సైతం సింగరేణి రెస్క్యూ స్టేషన్ శిక్షణ అందిస్తోంది.
మహిళల బృందం ఆదర్శంగా నిలవాలి
ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ బలరాం నాయక్ మాట్లాడుతూ, “మహిళా బృందం ఇతరులకు ప్రేరణగా నిలవాలి. శ్రమ, నైపుణ్యంతో అత్యుత్తమ సేవలు అందించాలని కోరుతున్నాం. త్వరలోనే మరో మహిళా రెస్క్యూ బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తాం” అని పేర్కొన్నారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల
