- అధికారులది ఓ తీరు.. సిబ్బందిది మరో తీరు…
- సమయపాలన పాటించని ఉద్యోగులు
Civil Supply Department: మంచిర్యాల జిల్లాలోని పౌరసరఫరాల సంస్థ పూర్తిగా గాడి తప్పినట్లయింది. జిల్లా కార్యాలయంలో డీఎంతో పాటు అసిస్టెంటు మేనేజర్, అసిస్టెంటు గ్రేడ్ 1, గ్రేడ్ 3 ఉద్యోగులు రెగ్యూలర్ కాగా ఇద్దరు కాంట్రాక్టు (డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్, మండల్ లెవల్ కో ఆర్డినేటర్), ఇద్దరు అకౌంటెంట్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్, ముగ్గురు ఆఫీస్ సబార్డినెట్లు (అటెండర్లు) ఔట్ సోర్సింగ్ పద్దతిన విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగులు సమయ పాలన పాటించకపోవడంతో సిబ్బంది సైతం అదే బాటను అనుసరిస్తున్నారు. ఓ అధికారి అయితే ఏండ్లకు ఏండ్లుగా ఇక్కడే తిష్ఠ వేసి ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులపై ఆజమాయిషీ చెలాయించడమే కాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఆ సారే ట్రాన్స్ పోర్టర్లకు బిల్లులు చేసేది.. ఆయన తలచుకుంటే పది కిలో మీటర్లు దూరమున్న మిల్లును పాతిక చేయడంలో దిట్ట. ఈ అదికారిని చూసి కొందరు కింది స్థాయి సిబ్బంది సైతం విధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.
అధికారులది ఓ తీరు…
సివిల్ సప్లయ్ కార్పొరేషన్ కార్యాలయం అంటేనే విచ్చలవిడి తనమనేట్టు ఉంది కొందరు అధికారుల, కొంత మంది సిబ్బంది వ్యవహారం. జిల్లా అధికారి ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. ఏదైనా సమాచారం కోసం ప్రభుత్వం కేటాయించిన మొబైల్ నెంబర్ కు ఫోన్ చేస్తే లేపరు, విధి నిర్వాహణలో బిజీగా ఉండి తీయలేదనుకుంటే అది పొరపాటే. వాట్సప్, మెసేజ్ లకు సైతం రిప్లై ఉండదు. తన శాఖలో జరుగుతున్న అవినీతి గురించి తెలియజేద్దామన్నా నో ఆన్సర్. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు ఏదైనా విషయంపై చాట్ చేస్తే సామాన్యులకు సైతం తిరిగి జవాబు ఇస్తుంటారు కానీ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం తీరే వేరు… ఫోన్ లేపరు.., కార్యాలయంలో కలువరు…
ఈయన టైమింగే సపరేటు…
మంచిర్యాల సివిల్ సప్లయ్ కార్పొరేషన్ లో ఏండ్లకు ఏండ్లుగా తిష్టవేసిన ఓ అదికారి గ్రేడ్ 2 నుంచి ప్రమోట్ అయి అసిస్టెంట్ గ్రేడ్ వన్ అయినా ఈ సీటును వదలడం లేదు. ఈ మహిపాలుడికి కార్యాలయ పని వేళలతో సంబందం ఉండదు. కిం(సిం)గ్ ఎప్పుడైనా రావచ్చు.., ఎప్పుడైనా పోవచ్చు… ఈ సారు ప్రతి రోజు కార్యాలయానికి 11.30 గంటల తర్వాత రావడం.., మధ్యాహ్నం రెండు గంటల తర్వాత లంచ్ కి వెళ్లడం.., తిరిగి సాయంత్రం 4.30 గంటల తర్వాత రావడం ఆనవాయితీ. ప్రభుత్వ ఉద్యోగుల సమయపాలన ఏమాత్రం పట్టదు. కార్యాలయంలో అన్ని పనులు చూడాల్సిన అధికారి అవేమి పట్టించుకోరు… ప్యాడీ ప్రొక్యూర్ మెంట్, గన్నీ ట్రాన్స్ పోర్టు, స్టేజ్ వన్, స్టేజ్ 2 తదితర ట్రాన్స్ ఫోర్ట్ బిల్లులపై పెట్టిన శ్రద్ద కార్యాలయంలో విధులపై ఉంచరు. ప్రొక్యూర్ మెంటు సమయంలో సమస్యలపై ఏమాత్రం పట్టించుకోరు కానీ ట్రాన్స్ పోర్టర్లకు బిల్లులు చేసేందుకు ముందుంటారు. ఈ సారు విధుల నిర్వాహణే సప‘రేటు’ అని ట్రాన్స్ పోర్టర్లే బాహాటంగా చర్చించుకోవడం కొసమెరుపు. గతంలో అదనపు కలెక్టర్ మోతీలాల్ పలు మార్లు ఈయన తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.. అయినా తీరు మారలేదు.. ఆయన సమయపాలన మార్చుకోలేదు…
సిబ్బందిది మరో తీరు…
సివిల్ సప్లయ్ సంస్థలో కొంత మంది సిబ్బంది తీరు కూడా మరోలా ఉంది. పెద్ద సార్లకు దగ్గరగా ఉంటూ, వారికి కేటాయించిన పనులను పక్కకు పడేసి తిరగడం ఓ లెక్కయితే, మిల్లర్లను సతాయించడం మరోలెక్క. ఈయనకు మిల్లర్లు సైతం భయపడుతుంటారు. జిల్లా అధికారి ఎవరొచ్చినా దగ్గరగా ఉండటం, వారితో కలిసి మిల్లులను తిరుగుతుంటాడు. కార్యాలయంలో విధులు నిర్వహించాల్సిన వ్యక్తి కొందరు అధికారుల స్వలాభం కోసం కష్టపడుతుండటంతో ఆయనకు అన్నీ మాఫీయే… ఎప్పుడైనా ఊరెళ్ల వచ్చు, ఏదైనా చేయవచ్చు… జీతంలో మాత్రం దాదాపుగా కోత ఉండదు.., ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులందరికి ఓ తీరైతే.., ఈయనది మరో తీరు…
ప్రభుత్వ కార్యాలయ పనివేళలో ఓ ఉద్యోగి, సిబ్బంది కార్యాలయంలో లేని విషయమై సివిల్ సప్లయ్ సంస్థ జిల్లా మేనేజర్ శ్రీకళను వివరణ కోరేందుకు ‘శెనార్తి మీడియా’ కార్యాలయానికి వెళ్లగా అందుబాటులో లేరు. ఫోన్ లో పలుమార్లు సంప్రదించే ప్రయత్నం చేయగా ఆన్సర్ చేయకపోగా, వాట్సప్ మెసేజ్ కు సైతం జిల్లా అధికారి స్పందించకపోవడం గమనార్హం.
-శెనార్తి మీడియా, మంచిర్యాల