complaint to collector
complaint to collector

complaint to collector: బెల్లంపల్లి ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి

మంచిర్యాల కలెక్టర్ కు బాధితుల ఫిర్యాదు

complaint to collector:బెల్లంపల్లి ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తన తల్లి మృతి చెందినట్లు షేక్ ముక్తార్ అనే వ్యక్తి ఆరోపించాడు. ఈ మేరకు ఆయన ప్రజావాణి కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ కుమార్ దీపక్ కు ఫిర్యాదు చేశారు.

గోల్బంగ్ల బస్తీకి చెందిన షేక్ ముక్తార్ ఫిర్యాదు మేరకు వివరాల ప్రకారం – గత నెల 28న రాత్రి 11.20 గంటల సమయంలో తన తల్లి అలిమ్ బేగమ్ అనారోగ్యానికి గురవడంతో బెల్లంపల్లి ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలిపాడు. అక్కడ సెక్యూరిటీ గార్డ్ మానిటర్‌ ద్వారా చెక్ చేసి, 90/60గా లో బీపీగా ఉందని తెలిపినట్టు పేర్కొన్నాడు. ఆ సమాచారం నర్సు ద్వారా డ్యూటీ వైద్యుడికి చేరగా, బీపీ పెంచేందుకు రెండు ఇంజెక్షన్లు వేయించారు. వాటిలో ఒకటిని సెక్యూరిటీ గార్డ్, మరొకటి నర్సు వేసినట్టు ఆరోపించాడు.

కొద్ది సేపటికి డాక్టర్ కు అనుమానం రావడంతో మాన్యువల్ పద్ధతిలో బీపీ పరీక్షించినట్లు వివరించారు. అప్పటికే బీపీ 220/160గా ఉండి, తల్లి కోమాలోకి వెళ్లిందని పేర్కొన్నాడు. ఆ సమయంలో వైద్యుడు నాలుగు ఇంజెక్షన్లు వేయడంతో పాటు పమ్‌పింగ్ చేశారని, అయినా కనీసం ఈసీజీ కూడా తీసకుండానే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసినట్టు పేర్కొన్నాడు.

అప్పట్లో బెల్లంపల్లి ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్ డీజిల్ పోయించాలంటూ బయటకు వెళ్లిపోయినట్టు తెలిపారు. వారి కుటుంబసభ్యులు స్వయంగా కష్టపడి తల్లిని మంచిర్యాల ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడి సిబ్బంది ఈసీజీ చేసి అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారన్నారు.

చెడిపోయిన మానిటర్‌తో బీపీ చెక్ చేసి ఇంజెక్షన్లు వేసిన సెక్యూరిటీ గార్డు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యుడు, డీజిల్ లేకపోవడంతో అంబులెన్స్ అందించని డ్రైవర్‌, పరికరాలు చెడిపోయినా పట్టించుకోని ఆసుపత్రి అధికారులు అందరిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ముక్తార్ ప్రజావాణి ద్వారా జిల్లా కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశాడు.

-శెనార్తి మీడియా, మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *