- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
EYE GLASSES : ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులలో కంటి అద్దాలు అవసరమైన వారికి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ లో గల కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) లో 20 మంది విద్యార్థులకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి (DM&HO) డాక్టర్ హరీష్ రాజ్ తో కలిసి కంటి అద్దాలు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 568 ప్రభుత్వ పాఠశాలల్లో, 164 రెసిడెన్షియల్ పాఠశాలల్లో 8 ఆర్.బి.ఎస్.కె. (RBSK) బృందాల ద్వారా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి 1,274 మందికి కంటి సమస్యలు ఉన్నట్లుగా గుర్తించామన్నారు. వీరందరికీ కంటి వైద్య నిపుణులు డాక్టర్ యశ్వంత్ రావు, డాక్టర్ చంద్రబాన్, డాక్టర్ శిల్ప శ్రీ,, ఆప్తాల్మిక్ అధికారులు శంకర్, భాస్కర్ రెడ్డిలు గత నెలలో ప్రభుత్వాసుపత్రిలో తిరిగి పరీక్షలు నిర్వహించి అద్దాల కోసం వివరాలు పంపించామన్నారు.

కంటి సమస్యలతో బాధపడుతున్న వారిని బృందాల ద్వారా గుర్తించి కంటి వైద్య నిపుణుల ద్వారా పరీక్షలు చేసి అద్దాలు పంపిణీ చేస్తున్నామని, వీటిని విద్యార్థులు తప్పనిసరిగా వినియోగించాలని కలెక్టర్ కోరారు. కంటి సమస్యలు రాకుండా ప్రతి ఒక్కరూ ఆహార అలవాట్లు మార్చుకోవాలని, ఏదైనా కంటి సమస్యలు ఉన్నట్లయితే ఆర్.బి.ఎస్.కె. (RBSK) బృందాల ద్వారా గుర్తించి ప్రభుత్వపరంగా చికిత్సలు పొందాలని సూచించారు.
ప్రతి ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వాతావరణ మార్పులతో వచ్చే వ్యాధులు, వేసవికాలంలో వడదెబ్బ నుంచి తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని, ఓ.ఆర్.ఎస్. (ORS) ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలోని 1,241 మంది విద్యార్థులకు కంటి అద్దాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఉప వైద్యాధికారి (Dy. DM & HO) డాక్టర్ అనిత, జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ యశ్వంతరావు, వైద్యాధికారులు డాక్టర్ ప్రసాద్, డాక్టర్ కృపాబాయి, డాక్టర్ అశోక్, డాక్టర్ శ్వేత, మాస్ మీడియా అధికారి (DEMO) బుక్క వెంకటేశ్వర్లు, KGBV పాఠశాల ప్రిన్సిపల్ స్వప్న, ఉపాధ్యాయులు, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :