మితిమీరిన వడ్డీలతో కుదేలవుతున్న చిరు వ్యాపారులు
వచ్చిన ఆదాయం అంతా వడ్డీలకే సరి
Finance: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో చిరు వ్యాపారులు గిరిగిరి ఫైనాన్స్ కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. వడ్డీ వ్యాపారుల ఆగడాలకు తీవ్రంగా నష్టపోతున్నారు. రిజిస్ట్రేషన్ లేని ఫైనాన్స్‌లతో పాటు అక్రమ చీటీ వ్యాపారులు మితిమీరిన వడ్డీ వసూలు చేస్తూ వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవాలనే తపనతో ఎవరికి వారే సొమ్ములు పొందుతున్నా, అధిక వడ్డీతో పాటు చెల్లింపుల్లో చిన్న లోపం వచ్చినా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
వడ్డీ వ్యాపారుల వద్ద రోజువారీ ఫైనాన్స్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో, ఒక్క రోజు కిస్తీ ఆలస్యం అయితే వడ్డీకి వడ్డీ వేస్తూ రెండింతలు డబ్బులు వసూలు చేస్తున్నారని చిరు వ్యాపారులు వాపోతున్నారు. మార్కెట్లో పెరిగిన పోటీ, కుటుంబ అవసరాల నిమిత్తం పనిచేస్తూ వడ్డీ కట్టడం మరింత కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చీటి వ్యాపారుల అక్రమ కార్యకలాపాలు కూడా వ్యాపారులకు తలనొప్పిగా మారాయి. చీటి డబ్బులు సమయానికి ఇవ్వక, డైలీ ఫైనాన్స్‌ల కోసం డబ్బులు నిలిపి వేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. కొంతమంది పోలీసు అధికారులు గతంలో చర్యలు తీసుకున్నారు. కానీ ప్రస్తుతం దృష్టి సారించకపోవడంతో ఈ వీరి ఆగడాలు మరింత పెరిగిపోతున్నాయి.
ప్రభుత్వ అధికారులు, స్థానిక పోలీసులను అప్రమత్తం చేసి, రిజిస్ట్రేషన్ లేని ఫైనాన్స్‌లను, అక్రమ చిట్టి వ్యాపారాలను నిరోధించి తమ జీవితాలలో వెలుగు నింపాలని చిరు వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల సంక్షేమానికి ఈ వ్యాపారాల నియంత్రణ తక్షణం అవసరమని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :
