Urea Strugles: దాదాపు నెల రోజులుగా అన్నదాతలు యూరియా కోసం అగచాట్లు పడుతున్నారు. రోజుకో సహకార సంఘం పరిధిలోని గోదాముల వద్దకు పరుగులు పెడుతున్నారు. పొద్దూమాపు అనే తేడా లేకుండా క్యూలో నిల్చొని బస్తా యూరియా కోసం నిరీక్షిస్తున్నాడు. అంతలా పడిగాపులు కాసినా యూరియా దొరుకుతుందనే నమ్మకం కూడా లేదు. తీరా తన వంతు వచ్చే సరికి యూరియా బస్తాలు అయిపోయినవి అనే మాట వినపడడంతో కళ్లల్లో నీళ్లతో నిరాశగా వెనుదిరుగుతున్నాడు.

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లి పీఏసీఎస్ పరిధిలోని గోదాముకు ఉదయం యూరియా లారీ వస్తుందనే సమాచారం అందుకున్న రైతులు సోమవారం ఉదయమే ఆగ మేఘాలమీద గోదాముకు చేరుకొని క్యూ కట్టారు.

వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ఓ చేతిలో ఛత్రీ మరో చేతిలో పట్టాదారు పాస్ పుస్తకాలు పట్టుకొని యూరియా కోసం పడిగాపులు కాశారు. సొసైటీ నిర్వాహకులు ప్రతి రైతుకు ఆధార్ కార్డుకు ఒక బస్తా మాత్రమే ఇస్తామని చెప్పడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వానకాలం సీజన్ అంతా రైతులు పనులు మానుకొని సొసైటీల చుట్టూ తిరగాల్సి వస్తున్నది వాపోతున్నారు. ఇంకా ఎన్ని రోజులు యూరియా కోసం ఎదురు చూడాలని అధికారులను నిలదీస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని యూరియా కొరత తీర్చాలని అన్నదాతలు కోరుతున్నారు.
మెట్టుపల్లి గోదాముకు 280 బస్తాలు రాగా, ముత్తారం గ్రాామానికి 230 బస్తాలు వచ్చాయి. ఒక్కో రైతుకు బస్తా చొప్పున పంపిణీ చేశారు.

-శెనార్తి మీడియా, శంకరపట్నం
