- విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారంటూ బెదిరింపులు
- కోటపల్లి మండలంలోని ఓ లైన్మెన్ ఆగడాలు
- ఒక్కో మీటరు మంజూరుకు రూ.10 వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు లైన్ మెన్ పై ఆరోపణలు
- కాంగ్రెస్ లీడర్ దగ్గరకు చేరిన పంచాయితీ
- కనెక్షన్ ఇస్తామంటూ సర్ది చెప్పే ప్రయత్నం
- డబ్బులు ఇవ్వకుండా, కనెక్షన్ ఇవ్వకుండా లైన్మెన్ వేధింపులు
Linemen Torture: అక్రమార్జనకు అలవాటు పడిన కొందరు విద్యుత్ అధికారులు కనెక్షన్ లేని ఇండ్లు, షాపులను టార్గెట్ చేస్తున్నారు. మీటర్ లేదని తెలిస్తే చాలు ఇక దొంగతనంగా కరెంట్ వినియోగించుకుంటున్నారని , కేసులు పెడతామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈ బెదిరింపుల వ్యవహారం అంతా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడలో చోటుచేసుకుంది. మీటర్ మంజూరు కోసం ఓ వ్యక్తి నుంచి రూ. 10 వేలు తీసుకొని రేపు, మాపు మొన్నటి దాటవేస్తూ వచ్చిన లైన్ మెన్ ఇప్పుడు ఏకంగా.. మీటర్ లేదు.. డబ్బులు ఇవ్వను ఏం చేసుకుంటావో.. ఎవరికి చెప్పుకుంటావో అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నాడు. ఇలాగే మరికొందరి వద్ద కూడా డబ్బులు తీసుకొని మీటరు మంజూరు కాకుండా తిరస్కరణ(రిజెక్ట్)కు గురయ్యేలా చేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
తాను చెప్పిందే రూల్..
“తాను చెప్పిందే రూల్” అన్నట్టుగా వ్యవహరించే లైన్ మెన్ రామకృష్ణ, డబ్బులు ఇవ్వకపోతే కరెంట్ కట్ చేస్తానని బెదిరించడం, డబ్బులు ఇచ్చాకే లైన్ ఇస్తున్నాడంటూ స్థానికులు ఆరోపిస్తున్నాయి. ఎర్రాయిపేటలో 100 మీటర్ల దూరంలో మీటర్ ఇచ్చిన సంఘటన, తాజాగా రాపనపల్లి దాబాకు 300 మీటర్ల దూరంలో కూడా కనెక్షన్ ఇచ్చిన ఘటనలు అక్రమాలకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

అల్సా రమేష్ అనే దాబా యజమాని మీటరు కోసం దరఖాస్తు చేయగా, “డబ్బులు ఇస్తేనే ఆన్ లైన్ మంజూరుకు అనుమతి వస్తుందంటూ బెదిరింపులకు గురి చేశాడు. డబ్బులు ఇవ్వకపోడంతో చివరికి దరఖాస్తును సైతం తిరస్కరించాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. చిన్న కిరాణ షాపుల వద్దకూ వెళ్లి కేటగిరీ-2 లేదు” అంటూ కేసులు పెడతానని బెదిరించి వసూళ్లు చేస్తున్నాడనే ఆరోపణలు సైతం ఉన్నాయి. లక్ష్మీపూర్‌లో నాగుల పద్మ అనే మహిళ వద్ద పలుమార్లు రూ. 2,000 నుంచి రూ. 5,000 వసూలు చేసిన ఘటనను గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు. ఇదే రామకృష్ణ గతంలో కోటపల్లిలో ఇలాంటి ఆరోపణలతో కొమ్మెరకు బదిలీ అయ్యాడు. కానీ డబ్బుల వసూళ్లకు అలవాటు పడిన రామకృష్ణ తిరిగి బదిలీ చేయించుకొని కలెక్షన్ కింగ్‌గా మారాడని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. “రామకృష్ణ ఆగడాలు అందరికీ తెలిసినా, ఉన్నతాధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు..?” అనే ప్రశ్న స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నది.
అధికార పార్టీ నాయకుడి వద్దకు చేరిన ముడుపుల వ్యవహారం
దాబా యజమాని అల్సా రమేష్ నియోజకవర్గంలో పేరొందిన అధికార పార్టీ నాయకుడిని తన గోడును వెళ్లబోసుకున్నాడు. దీంతో సదరు నాయకుడు లైన్ మెన్ కి ఫోన్ చేయగా, కనెక్షన్ ఇస్తానంటూ ఫోన్ లో సర్ధి చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత యథావిధిగా బాధితుడిపై తన విశ్వరూపం చూపాడు. నీకు కనెక్షన్ ఇచ్చేది లేదంటూ మరింత బెదిరింపులకు గురి చేశాడు. విజిలెన్స్ అధికారులు రమేష్ దాబాలో తనిఖీ చేసి రూ. 1200 జరిమానా వేశారు.
ఈ విషయయై మంచిర్యాల ఎస్ఈ ఉత్తమ్ జాడేను వివరణ కోరగా 30 మీటర్ల కంటే దూరం ఉంటే కనెక్షన్ ఇవ్వడానికి అనుమతి లేదు. నిబంధనలు విస్మరించి కనెక్షన్ ఇస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. లైన్ మెన్ డబ్బులు తీసుకున్న విషయం తన దృష్టికి రాలేదని, ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల(కోటపల్లి) :
