- ప్రారంభించని అధికారులు
- కుప్పలుగా పడి ఉన్న ఆరిన వడ్లు
PADDY PROCUREMENT : జిల్లాలో పౌరసరఫరాల శాఖ అధికారులు, జిల్లా అదనపు కలెక్టర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్దం చేసి ఉంచామని, ఆరిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తున్నామని ప్రకటనలు చేస్తున్న అధికారులు క్షేత్ర స్థాయిలో మాత్రం అవేమి కనిపించడం లేదు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఇటీవల జిల్లా కలెక్టర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలో 321 ధాన్యం కొనుగోలు కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో, మున్సిపాలిటీ కేంద్రాలలో ప్రారంభించామని ప్రకటించారని, అది కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యిందని, క్షేత్ర స్థాయిలో మరోలా ఉంది.

కొనుగోలు కేంద్రాలకు వస్తున్న ధాన్యం
జిల్లాలోని జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో రైతులు హార్వేస్టింగ్ చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నారు. కొన్ని మండలాల్లో తీసుకువచ్చిన ధాన్యం ప్రభుత్వం నిర్ధేశించిన ప్రమాణాల ప్రకారం ఆరి సిద్ధంగా ఉంది. కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో కుప్పలుగా పోసి వేచి చూస్తున్నారు. మరోవైపు వాతావరణంలో మార్పుల కారణంగా ఏ రోజు వర్షం వస్తుందో, పంట తడుస్తుందోనని భయం భయంగా గడుపుతున్నారు. కల్లాల్లో ఆరిన ధాన్యం కుప్పలుగా పోసి రైతులు ఎదురు చూస్తున్నారు. అసలు ఇప్పటి వరకు ఏ గ్రామంలో ఏ ఏజెన్సీ ధాన్యం కొనుగోలు చేయనుందోననే విషయమే రైతులకు తెలియడం లేదు.

అధికారులు ప్రకటించింది నిజమేనా..?
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్, సివిల్ సప్లయ్ అధికారులు ప్రకటించిన విధంగా జిల్లాలో డీఆర్డీఏ 194, పీఏసీఎస్ 121, మెప్మా 6 కేంద్రాలలో ఏ ఒక్క కేంద్రం ప్రారంభం కాలేదు. జిల్లా స్థాయి అధికారులే ప్రారంభించినట్లు ప్రకటించడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఇంత వరకు ఏ గ్రామంలో ఏ ఏజెన్సీ ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతుందో తెలియదని, అధికారులు పేపర్లకు ఫోజులిచ్చి ప్రకటనలు చేస్తున్నారే తప్పా గ్రౌండ్ లెవల్ లో అదేమి లేదని రైతులు బాహాటంగానే పేర్కొంటున్నారు. ప్రభుత్వమే కొనుగోలు చేస్తే మేమెందుకు ప్రైవేటుగా తక్కువ ధరకు మిల్లులకు అమ్ముకుంటామని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు మేల్కొని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :