Palle Dawakhana:శంకరపట్నం మండలం మెట్టుపల్లి గ్రామంలోని పల్లె దవఖాన మందుబాబులకు అడ్డాగా మారింది. పరిశుభ్రతలో నిర్లక్ష్యం చోటుచేసుకుంది. హస్పిటల్ ప్రాంగణంలో నీరు, గడ్డి, చెత్త పేరుకుపోవడంతో పాటు బీరు బాటిళ్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు ఆవరణ అంతా పడేసి ఉన్నాయి.

గ్రామానికి దూరంగా ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.వైద్యాధికారులు, ఏఎన్ఎంలు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ వద్ద నీరు నిల్వ ఉండటంతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులు, జిల్లా వైద్యాధికారులుఈ పల్లె దవాఖానపై దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కాగా ఈ విషయమై మండల వైద్యాధికారి శ్రవణ్ కుమార్ ను వివరణ కోరగా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఏమీ లేదని స్పష్టం చేశారు. రాత్రి వేళలో తమ సిబ్బంది సబ్ సెంటర్ లో ఉండరని పేర్కొన్నారు. దేవాలయం లాంటి హాస్పిటల్ లో మందు బాబులు మద్యం తాగుతుంటే గ్రామస్తులు కూడా చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తిని, హాస్పిటల్ ను కాపాడుకోవాల్సిన బాధ్యతను గ్రామస్తులు తీసుకోవాలి. సబ్ సెంటర్ లో మద్యం తాగేది దాదాపు అక్కడి వారై ఉంటారే తప్ప బయటి వ్యక్తులు రారు. గ్రామస్తులు కూడా హాస్పిటల్ ను కాపాడుకోవాలి.
