197 మొబైల్ ఫోన్ల రికవరీ
CEIR: ఆధునిక టెక్నాలజీని వినియోగించి, ప్రజల ఆస్తులను రక్షించడంలో మందమర్రి పోలీసులు విశేష ఫలితాలు సాధించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ సహాయంతో ఇప్పటివరకు 197 పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించారు.
తాజాగా రికవరీ అయిన రూ.1.2 లక్షల విలువైన ఏడు మొబైల్ ఫోన్లను మంగళవారం సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, సీఈఐఆర్ ఫిర్యాదులను సత్వర పరిష్కారం చేయడానికి ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటివరకు వచ్చిన 280 ఫిర్యాదుల్లో 197 ఫోన్లను రికవరీ చేసినట్లు వివరించారు. మిగిలిన ఫోన్లను కూడా త్వరలోనే రికవరీ చేస్తామని చెప్పారు.
సీఈఐఆర్ పోర్టల్ మొబైల్ రికవరీలో కీలకపాత్ర పోషిస్తోందని, ఫోన్ బ్లాక్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడా ఉపయోగించలేరని వివరించారు. ఫోన్ పోగొట్టుకున్నప్పుడు వెంటనే http://www.ceir.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. తక్కువ ధరకు ఫోన్లు విక్రయిస్తున్న అనుమానాస్పద వ్యక్తుల గురించి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను స్వీకరించిన బాధితులు పోలీసుల సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. టెక్నికల్ బృందం చూపిన ప్రతిభను సీఐ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల