రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పిలుపు
BRS Korukanti: తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ స్థాపించి 25 వసంతాలు పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని రామగుండం మాజీ శాసనసభ్యుడు, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు.
బుధవారం రాత్రి గోదావరిఖనిలోని లక్ష్మి ఫంక్షన్ హాల్‌లో రామగుండం నియోజకవర్గ పార్టీ ముఖ్యనేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “గులాబీ దండు కదం తొక్కాలి, ఓరుగల్లు దద్దరిల్లాలి, కాంగ్రెసోళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి” అంటూ కార్యకర్తల్లో జోష్ నింపారు.
తెలంగాణ సాధనలో గులాబీ పార్టీ పోషించిన పాత్రను గుర్తు చేస్తూ, ఎన్నో అవమానాలు, అవహేళనలను అధిగమించి కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్రాన్ని సాధించిన ఘనత బీఆర్ఎస్‌దేనని పేర్కొన్నారు. ప్రజల కలను సాకారం చేసిన గులాబీ జెండా గర్వంగా ఎగురుతున్నదన్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్ధాలను నమ్మి ప్రజలు అధికారం అప్పగించారని, కానీ వారు ప్రజలకు ఏం చేయలేక ప్రజల నుంచి దూరమయ్యారని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసిందని, అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రజల పక్షాన నిలబడిన పార్టీగా నిలిచిందన్నారు.
కేసీఆర్ పాలనే ఈ రాష్ట్రానికి రక్షణగా ఉంటుందని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పాలన విఫలమైందని, హైడ్రా పేరుతో పేద ప్రజలపై తన్నుల పెట్టారని ఆరోపించారు. భూముల అమ్మకాల పేరుతో మూగ జీవాల హక్కులను తాకట్టు పెట్టారని, మూగ జీవాల గోస రేవంత్ పాలనను తగులుతుందని వ్యాఖ్యానించారు.
రుణమాఫీ పేరుతో ప్రజల్ని మోసం చేశారని, హామీల అమలుపై నిలదీయగానే తమపై కేసులు పెట్టారని మండిపడ్డారు. కేసులు పెట్టినా, అడ్డంకులు పెట్టినా ప్రజల కోసం పోరాటం ఆగదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలన గాడితప్పిందని, ప్రజలలో వ్యతిరేకత పెరుగుతోందని చెప్పారు.
ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను స్వచ్ఛందంగా విజయవంతం చేయాలని, రామగుండం నియోజకవర్గం నుంచి కార్యకర్తలంతా వేలాదిగా తరలిపోవాలని కోరారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు.
ఈ సమావేశంలో పార్టీ నాయకులు కౌశిక్ హరి, నడిపెల్లి మురళీధర్ రావు, పెంట రాజేష్, జేవీ రాజు, గోపు అయిలయ్య, పాముకుంట్ల భాస్కర్, రమణారెడ్డి, కల్వచర్ల కృష్ణ వేణి, రాకం వేణు, కుమ్మరి శ్రీనివాస్, జనగాన కవిత సరోజినీ, అచ్చే వేణు, నూతి తిరుపతి, చెలకలపల్లి శ్రీనివాస్, మేడి సదానందం, జక్కుల తిరుపతి, మేతుకు దేవరాజ్, శ్రీరామోజు మహేష్, ముద్దసాని సంధ్యారెడ్డి, గుంపుల లక్ష్మి, సట్టు శ్రీనివాస్, బుర్ర వెంకన్న, రామరాజు, నీరటి శ్రీనివాస్, ఇరుగురాళ్ల శ్రావన్, కొడి రామకృష్ణ, చింటూ, ఆవునూరి వెంకటేష్ పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, గోదావరిఖని: