ప్రాణాలకు తెగించి.. గర్భిణిని ఒడ్డుకు చేర్చిన పోలీసులు
Tandur Police: రెండు రోజులుగా కురుస్తున్న తెలంగాణ రాష్ర్టంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ర్ట సరిహద్దు జిల్లాలైన మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలను వరద ముంచెత్తుతున్నది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని నర్సాపూర్ గ్రామంలో వాగు నీరు ఉధృతంగా ఉండటంతో గ్రామస్తులు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
ఈ క్రమంలో ఓ గర్భిణి వైద్య చికిత్స కోసం గ్రామం నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. అయితే వాగు ఉధృతి కారణంగా కుటుంబ సభ్యులు స్వయంగా ఆమెను దాటించేందుకు ప్రయత్నించినా విఫలమయ్యారు. విషయం తెలిసిన వెంటనే తాండూర్ ఎస్‌ఐ(Tandur SI) కిరణ్ కుమార్(Kiran Kumar) తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వరద ఉధృతిని లెక్క చేయకుండా తాడు సాయంతో వాగు దాటి అవతలి వైపు వెళ్లారు.. గర్భిణిని భుజాన మోసుకుంటూ సురక్షితంగా మరోవైపు చేర్చారు.
తరువాత ఆమెను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చేశారు. ఈ సంఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది. తమ ప్రాణాలకు తెగించి అత్యవసర సమయంలో సహాయం చేసిన పోలీసులకు గర్భిణి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి పోలీసులు చేసిన ఈ రక్షణ చర్యను ప్రజలు ప్రశంసిస్తున్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల
