ACB Ride : మంచిర్యాల జిల్లా కోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇన్చార్జి గడియారం శ్రీనివాసులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. నస్పూర్ ప్రాంతంలోని కలెక్టరేట్ కార్యాలయం రోడ్డు వద్ద మంగళవారం ఉదయం రూ.6 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడికి సంబంధించిన రెండు నెలల డీఏ బకాయిల బిల్లులు సిద్ధం చేసి, డీడీవోకు సమర్పించేందుకు గడియారం శ్రీనివాసులు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. లంచం డబ్బును అధికారులు స్వాధనీం చేసుకున్నారు. అతడి కుడిచేతి వేళ్లు, ప్యాంటు జేబులోని లోపలి భాగాన్ని రసాయన పరీక్షలకు పంపించారు. ఈ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో శ్రీనివాసులును అరెస్ట్ చేసి కరీంనగర్‌లోని ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
ఫిర్యాదు వివరాలను గోప్యంగా ఉంచుతాం..
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే, తక్షణమే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. వాట్సాప్ నంబర్ 9440446106, ఫేస్బుక్లో Telangana ACB, ట్విట్టర్లో @TelanganaACB ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో డీస్పీ జీ మధు, సిబ్బంది పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల
