Teacher: విద్యార్థులకు విద్య అందించాల్సిన ఉపాధ్యాయుడు విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ, కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల వద్ద శుక్రవారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. పాఠశాల గేట్ ఎదుట ధర్నాకు దిగారు.
వివరాల ప్రకారం, అయిదు నెలల క్రితం మైలారం పాఠశాలకు బదిలీపై వచ్చిన ఉపాధ్యాయుడు రామ్ రాజయ్య తరగతుల్లో పాఠాలు చెప్పకుండా తరచూ నిద్రపోతున్నాడని, ప్రశ్నించిన విద్యార్థులపై దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని తల్లిదండ్రులు ఆరోపించారు. ఆయనే కాకుండా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, అటెండర్, మధ్యాహ్న భోజన సిబ్బందిపై కూడా ఒత్తిడి తీసుకువస్తున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు.
రామ్ రాజయ్య తరగతిగదిలో నిద్రపోతున్న దృశ్యాలు, టేబుల్ మీద కాళ్లు పెట్టుకుని పడుకున్న ఫోటోలు చూపిస్తూ స్థానికులు ఆయనను పాఠశాల నుంచి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. .
మరోవైపు రామ్ రాజయ్య తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. పాఠశాలలో మంచినీరు, శుభ్రత వంటి మౌలిక సదుపాయాల కొరతపై ప్రశ్నించడంతోనే ఈ విధమైన కుట్రలు జరుగుతున్నాయన్నారు. పాఠశాల లోపాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినందుకే పై తప్పుడు ఆరోపణలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు.
ఈ ఘటనపై విద్యాశాఖ, పోలీసు శాఖలు స్పందించాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.
-శెనార్తి మీడియా, గన్నేరువరం