- ఎస్ఎంఎస్ ద్వారా అప్లికేషన్ పురోగతి…
- అప్లికేషన్ ట్రాకింగ్ సదుపాయం…
- ‘శెనార్తి మీడియా’తో విద్యుత్ శాఖ ఎస్ఈ గంగాధర్
TGNPDCL SE : వినియోగదారులకు ఉత్తమమైన సేవలు అందించడంలో భాగంగా కొత్త విద్యుత్ సర్వీసుల మంజూరును మరింత సులభతరం చేశామని టీజీ ఎన్పీడీసీఎల్ (TG NPDCL) మంచిర్యాల సర్కిల్ విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ (SE) గంగాధర్ తెలిపారు. సోమ వారం ఆయన ‘శెనార్తి మీడియా’తో మాట్లాడుతూ.. కొత్త సర్వీసుల కోసం దరఖాస్తు చేసుకున్న వినియోగదారులకు ఏదైనా కారణంతో తిరస్కరణ (REJECT) చెందితే వారికి తగిన సూచనలు చేస్తూ, మార్గదర్శకాలను అందిస్తూ మరో అవకాశం కల్పిస్తున్నామన్నారు. మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడంలో భాగంగా కొత్త విద్యుత్ సర్వీసుల మంజూరును వేగవంతంగా, సులభతరంగా చేస్తున్నామని స్పష్టం చేశారు.
♦ఎస్ఎంఎస్ ద్వారా అప్లికేషన్ పురోగతి…
నూతన విద్యుత్ సర్వీస్ మంజూరులో పారదర్శకతను పెంచేందుకు, దరఖాస్తు చేసిన వినియోగదారులకు సమాచారం ప్రతి దశలో ఎస్ఎంఎస్ (SMS) ద్వారా అందుబాటులోకి తెచ్చినట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ (SE) గంగాధర్ వెల్లడించారు. వినియోగధారులు అవసరమైన పత్రాలను సమర్పించాల్సిన దశల్లో వారికి ముందస్తుగా సందేశం పంపించడం ద్వారా, వారు నిర్దిష్ట సమయంలో పత్రాలను సమర్పించడానికి వీలు కల్పించామని వివరించారు. దీని ద్వారా అప్లికేషన్ ఆలస్యం కాకుండా, వేగంగా విద్యుత్ సర్వీసు మంజూరు చేయవచ్చన్నారు.
♦అప్లికేషన్ ట్రాకింగ్ సదుపాయం…
కొత్తగా అభివృద్ధి చేసిన ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా వినియోగదారులు తమ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చునని ఎస్ఈ గంగాధర్ వెల్లడించారు. టీజీ ఎన్పీడీసీఎల్ (TG NPDCL) వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ (MOBILE APP) ద్వారా అప్లికేషన్ నంబర్‌ను ఉపయోగించి, దరఖాస్తు ఏ దశలో ఉందో సులభంగా తెలుసుకునే వీలుందని తెలిపారు. అలాగే కొత్త విద్యుత్ సర్వీసుల మంజూరుకు సంబంధించిన మరింత సమాచారం కోసం 1912 నంబర్‌కు కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. ఈ విధానాల ద్వారా టీజీ ఎన్పీడీసీఎల్ (TG NPDCL) సంస్థపై వినియోగదారులకు పారదర్శకత, జవాబుదారీతనం, నమ్మకం, సంతృప్తి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల: