- ప్రాణహిత కృష్ణ జింకల అభయారణ్యాన్ని సందర్శించిన చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్
FOREST PCCF : ప్రాణహిత కృష్ణ జింకల అభయారణ్యాన్ని తెలంగాణ రాష్ట్ర చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్, విజిలెన్స్ పిసిసిఎఫ్ (Principal Chief Conservator of Forests ) ఏలూ సింగ్ మెరూ సందర్శించి
అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సోమ వారం సమీక్ష నిర్వహించారు. చెన్నూర్ అటవీ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి – 63 వెంట చింతపల్లి బీట్ పరిధిలో ఏర్పాటు చేస్తున్న పారిపల్లి చింత ఫారెస్ట్ చెక్‌పోస్ట్, కిష్టంపేట వై(Y) జంక్షన్ చెక్‌పోస్టుల నిర్వహణ, వాటి ప్రాముఖ్యత, సంరక్షణ చర్యల గురించి అధికారులతో అడిగి తెలుసుకున్నారు.
అటవీ ప్రదేశాల్లో వన్యప్రాణుల సంరక్షణ, అక్రమ వేటను అరికట్టడం, చెక్‌పోస్టుల ద్వారా అటవీ పరిరక్షణను మరింత మెరుగుపరచడం అనే ప్రధాన లక్ష్యాలపై చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ ఏలూ సింగ్ మెరూ అధికారులకు సూచనలు చేశారు. అడవుల్లో అక్రమంగా ప్రవేశించే వ్యక్తులను అరికట్టేందుకు చెక్‌పోస్టుల నిర్వహణ ఎంతవరకు ప్రభావంతంగా ఉందనే విషయాన్ని సమీక్షించారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి, పర్యాటక ప్రాంతంగా మార్చే దిశగా అడుగులు వేస్తామని ఆయన వెల్లడించారు.
చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలు, పెట్రోలింగ్ వాహనాలు, మానవ వనరులను పెంచడం ద్వారా రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అక్రమ వేటగాళ్ల కదలికలను గుర్తించేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ (PD) శాంతారాం, మంచిర్యాల డీఎఫ్ఓ (DFO) శివ్ ఆశిష్ సింగ్, చెన్నూర్ అటవీ అధికారి కె సర్వేశ్వర్, చెన్నూర్, నీల్వాయి, కోటపల్లి రేంజ్ అధికారు(FRO)లు కె శివకుమార్, జి అప్పలకొండ, సదానందం, డిఆర్ఓ(DRO)లు ప్రభాకర్, లావణ్య అటవీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :