- నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించాలి
- రామగుండం సీపీ శ్రీనివాస్
- మంచిర్యాలలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ
Traffic Awareness: హెల్మెట్ భారం కాదు.. భద్రత అని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మంచిర్యాల ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని మహిళలు, సీనియర్ సిటిజన్లు, మున్సిపల్ సిబ్బందికి 150 హెల్మెట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సీపీ శ్రీనివాస్ మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. బైక్ నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునేవారు కూడా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు భద్రతపై ప్రజలలో అవగాహన పెంచేందుకు స్కూళ్లు, కళాశాలలు, వాహనదారులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వాహనదారులు వేగాన్ని నియంత్రించి, హెల్మెట్, సీటు బెల్టులు తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. వాహనదారులు సురక్షితంగా ప్రయాణించడం ద్వారా కుటుంబాలు కూడా ఆనందంగా ఉంటాయి అన్నారు.
ఈ కార్యక్రమానికి హెల్మెట్లు స్పాన్సర్ చేసిన ట్రస్మా జిల్లా అధ్యక్షుడు ఎండీ అజీజ్, ట్రస్మా పట్టణ అధ్యక్షుడు కొమ్ము దుర్గాప్రసాద్, ట్రస్మా జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎండీ ఉస్మాన్ పాషా, ట్రస్మా మందమర్రి జనరల్ సెక్రటరీ లతా శ్రీ, మంచిర్యాల కళాశాలల ప్రెసిడెంట్ రమణలను సీపీ సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, ఏసీపీ ఆర్ ప్రకాశ్, ట్రాఫిక్ ఏసీపీ జాడి నరసింహులు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, ఎస్ఐలు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల