- హుజూరాబాద్ బీజేపీలో కలకలం
Disputes in BJP : హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీలో అంతర్గత పోరు ముదురుతోంది. ‘‘బీజేపీలో గ్రూపులు లేవు, మోదీ గ్రూపు ఒక్కటే’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గురువారం హుజూరాబాద్‌లో ప్రకటించిన తరువాత ఒక్కరోజులోనే పార్టీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. వీణవంక మండలంలో కొంతమంది నేతలు శుక్రవారం సమావేశం ఏర్పాటు చేయనుండగా, ఇటీవలే జమ్మికుంట మండలంలోని నేతలు కూడా ఇదే తరహాలో అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ నెల 16న జమ్మికుంట బీజేపీ నాయకులు పార్టీ కార్యకలాపాలపై సమాచారం ఇవ్వకపోవడం, భవిష్యత్‌లో టికెట్లపై సందేహం వ్యక్తం చేస్తూ సమావేశం నిర్వహించడం పార్టీ అంతర్గతంగా ఉద్రిక్తతకు దారితీసింది. తాజాగా వీణవంకకు చెందిన నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతంరెడ్డి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించడంతో వర్గపోరు తెరపైకి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిణామాలు బీజేపీని తీవ్ర చిక్కుల్లోకి నెట్టుతున్నాయి.
జిల్లా అధ్యక్షుడి నియోజకవర్గంలోనే అసంతృప్తి
పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన నాయకుడు. ఆయన ఆధ్వర్యంలోనే బీజేపీ పటిష్టంగా ముందుకు సాగాల్సిన సమయంలో, పార్టీ అంతర్గత కలహాలు ఆయనకు తలనొప్పిగా మారాయి. 2021లో ఈటల రాజేందర్ ఉపఎన్నికల్లో గెలుపు తరువాత పలు పార్టీల నుంచి నాయకులు బీజేపీలో చేరగా, 2023లో ఈటల ఓటమి పాలయ్యారు. అనంతరం మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలవడంతో ఆయన హుజూరాబాద్‌పై మొండి వైఖరిని చూపిస్తున్నారు.
ఈటల వర్గంగా పేరొందిన నేతలు ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్‌పై ఆందోళనకు లోనవుతున్నారు. మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి, త్వరలోనే ఈటలను కలసి నిర్ణయం తీసుకునేందుకు యోచిస్తున్నారు. కొంతమంది పార్టీకి వీడచెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితులను ప్రత్యర్థి పార్టీలు తమకు అనుకూలంగా మలచుకునే వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి.
బీజేపీలో గ్రూపుల్లేవన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు విరుద్ధంగా శ్రేణుల్లో అసంతృప్తి విపరీతంగా పెరిగిన తీరు పార్టీకి హెచ్చరికగానే నిలుస్తోంది.
శెనార్తి మీడియా, కరీంనగర్:
