– వే బిల్లులు లేకుండానే ధాన్యం తరలింపు
– అనుమతులు ఒక చోట.. నిలువలు మరో చోట…
ZERO DANDA : మండలంలో జోరుగా ధాన్యం జీరో దందా సాగుతోంది. ఎలాంటి వే బిల్లులు లేకుండానే ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ ఎలాంటి అనుమతులు లేకుండానే గోదాముల్లో నిలువ చేస్తున్నారు. ఇదంతా అధికారుల కండ్ల ముందే జరుగుతున్నా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారంటే వారికి ఇది ‘మామూలు’గా నడిచే వ్యవహరమని చెప్పకనే అర్థమవుతోంది.
వే బిల్లులు లేకుండానే ధాన్యం తరలింపు
ట్రేడింగ్ లైసెన్స్ పొందిన వ్యాపారులు రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయవచ్చు. అది కూడా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర తగ్గకుండా చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ఆ ధాన్యాన్ని వే బిల్లుతో మిల్లుకు లేదా గోదాములకు తరలించుకోవచ్చు. కానీ మండలంలో అలా జరుగడం లేదు. రైతుల వద్ద తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి వారి వారి ప్రైవేటు గోదాముల్లో నిలువ చేసుకుంటున్నారు.

విత్తన సీడ్ పేరిట జోరుగా జీరో దందా
మండలంలో సుమారు 24 వేల ఎకరాల్లో వరి పంట సాగయింది. ఇందులో 15 వేల ఎకరాల్లో సీడ్ విత్తనాలే సాగు చేశారు. ఈ సీడ్ విత్తనాలు సైతం సేకరించే సమయంలో ఏ రైతు వద్ద ఎంత కొనుగోలు చేశారో, అది ఎక్కడ నిలువ ఉంచారో వివరాలు సంబంధిత అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. కానీ మండలంలో ఇవేమి కానరావడం లేదు.
ముడుపులిస్తూ.. మ్యానేజ్ చేస్తూ…
మామూళ్లకు అలవాటు పడ్డ అధికారులకు వ్యాపారులు పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లిస్తూ ‘మ్యానేజ్’ చేసుకుంటున్నారనే ఆరోపణలు కోకొల్లలుగా వినిపిస్తున్నాయి. వ్యాపారులు ధాన్యం నిలువ చేసుకునేందుకు అనుమతి ఒక చోట తీసుకొని మరో చోట నిలువలు ఉంచుతున్నారు. ఇలాంటి నిలువలను వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సీజ్ చేసే అవకాశం ఉన్నా అవేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనితో వారి వ్యాపారం ‘మూడు చోట్ల అనుమతి.., ఆరు చోట్ల నిలువలు’ అన్నట్టు సాగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలా అనుమతి లేని, జీరో దందాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అనుమతి లేకుండా నిలువ చేస్తే చర్యలు తప్పవు – వెంకటేశ్, మండల వ్యవసాయ అధికారి (MAO), శంకరపట్నం
వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం (సీడ్ లేదా ఓపీ)ను అనుమతి తీసుకున్న గోదాముల్లోనే నిలువ చేయాలి. మండలంలో సోనం కంపెనీ మాత్రమే అనుమతి తీసుకున్నారు. ఎవరైనా అనుమతి లేకుండా గోదాముల్లో ధాన్యం నిలువ చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
– శెనార్తి మీడియా, కరీంనగర్ :