SRSP: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, కడెం ప్రాజెక్ట్ గేట్లు తెరచి నీటిని విడుదల చేయడంతో పాటు కురిసిన వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో వరద ముప్పు పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్లను మరింత ఎత్తి రోజుకు దాదాపు ఆరు నుంచి ఏడు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసే అవకాశముందని అధికార వర్గాలు సూచించాయి.
నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేపలు పట్టేందుకు లేదా పశువులు, గొర్రెలతో నది ఒడ్డులకు వెళ్లరాదని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సూచించారు. అలాగే రైతులు, గొర్రెకాపరులు నది దాటి ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వరద వివరాలు
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో గురువారం ఉదయం 10 గంటలకు నీటి మట్టం 146.59 మీటర్లుగా నమోదైంది. పూర్తి స్థాయి 148.00 మీటర్లు కాగా, ప్రస్తుత నిల్వ 16.3621 టీఎంసీలు ఉంది. ప్రాజెక్ట్ మొత్తం నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు.
ప్రాజెక్ట్‌కు క్షణిక ప్రవాహం 8,12,432 క్యూసెక్కులు చేరుతోంది. వీటిలో శ్రీరాంసాగర్ నుంచి 3,50,000 క్యూసెక్కులు, కడెం నుంచి 41,196 క్యూసెక్కులు, క్యాచ్మెంట్ ప్రాంతం నుంచి 4,21,236 క్యూసెక్కులు వస్తున్నాయి.
దిగువకు క్షణిక ఔట్‌ఫ్లో 6,30,182 క్యూసెక్కులు వదులుతున్నారు. వీటిలో గేట్ల ద్వారా 6,29,880 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొత్తం 62 గేట్లలో 40 గేట్లు తెరిచి నీటిని వదులుతున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం వెల్లడించింది.
గూడెం, నంది, వేమ్నూర్ పవర్‌హౌస్‌లు, ఎన్టిపిసి ద్వారా నీటి విడుదల లేదు. హెచ్ఎండబ్ల్యుఎస్ ద్వారా కేవలం 302 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల
