కాంగ్రెస్ తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు బండారు రమేష్
Congress Pressmeet: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యాలని, అవాస్తవాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండారు రమేష్ తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఎల్ఎండి కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, గ్రామసభల సమక్షంలోనే అర్హులైన వారిని ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు. ఇళ్ల మంజూరు పేరిట ఎవరి వద్ద ఏవిధమైన అనవసరమైన డబ్బులు తీసుకోలేదని బలంగా నొక్కి చెప్పారు. “ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చెప్పడం రసమయి బాలకిషన్ రాజకీయ పద్ధతని, ఇది ప్రజలను భ్రమింపజేసే ఒక మహత్తర ప్రయత్నం మాత్రమే” అని ఆయన విమర్శించారు.
గత ప్రభుత్వం సమయంలో కొందరు ప్రత్యేక వర్గాల వారికి మాత్రమే ఫార్మ్ హౌస్లు మంజూరు కాగా, ప్రస్తుతం అర్హత కలిగిన నిజమైన
నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని వివరించారు. “గోసి గొంగడి ఉండి ఉంటే వారికి కూడా ఇల్లు వచ్చేదని, కానీ గత ప్రభుత్వంలో కొందరు పెద్దలకు మాత్రమే ఫార్మ్ హౌస్లు ఇచ్చారని ఆయన వ్యంగ్యంగా విమర్శించారు.
రామకృష్ణాపూర్ కాలనీలో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాల గురించి రసమయి మాట్లాడటం విచిత్రమని, పదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆ ఇళ్లను ఎందుకు పూర్తి చేయించలేకపోయారని ఆయన మండిపడ్డారు. మానకొండూర్ కు పట్టిన ఈ దయ్యం సీసాలో బంధించినా, సీసా నుంచే వేదాలు వినిపిస్తున్నారు” అని ఆయన ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మహిళల ఉచిత బస్ ప్రయాణం, 500 రూపాయల గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు వంటి ప్రజాహిత పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాస పథకాలు కూడా త్వరలో పూర్తిస్థాయిలో అమలవుతాయని ఆయన చెప్పారు.
ధాన్య కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంఘటితంగా కొనుగోలు ప్రక్రియ జరుగుతోందని, తరుగు, కోత, తూకాల్లో మోసాలు జరగకుండా కఠినంగా పర్యవేక్షిస్తున్నామని, జాప్యం లేకుండా చెల్లింపులు చేస్తున్నామని వివరించారు.
ఈ విలేకరుల సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్, పార్టీ నాయకులు గోపు మల్లారెడ్డి, మామిడి అనిల్ కుమార్, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, కుంట రాజేందర్ రెడ్డి, శ్రీగిరి రంగారావు, చింతల లక్ష్మారెడ్డి, బుదారపు శ్రీనివాస్, పోలు రాము, మాచర్ల అంజయ్య, ఎలకపల్లి సంపత్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, తిమ్మాపూర్
