మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారి కల్పన
Mancherial DAO :మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని పోతన్‌పల్లి గ్రామంలో మంగళవారం ఉదయం సందడి నెలకొంది. రైతులందరూ గ్రామ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తరలివచ్చారు. వర్షకాలం సీజన్ ప్రారంభానికి ముందు పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు అధికారులు సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి కల్పన రైతులకు పంటల వేళ మార్పు ప్రాముఖ్యతను వివరించారు. వరి, పత్తి వంటి పంటలను ముందుగానే సాగు చేస్తే అధిక దిగుబడులు పొందవచ్చు. చీడపీడల ప్రభావం తగ్గుతుంది. అకాల వర్షాల వల్ల పంట నష్టపోవడం కూడా తగ్గుతుంది అంటూ ఆమె వివరించారు.
పంట అవశేషాలను తగలబెట్టకుండా భూమిలో కలియదున్నితే భూమి సారపరంగా మెరుగుపడుతుందని చెప్పారు. ఇది భవిష్యత్ పంటల దిగుబడులకు మేలని రైతులకు సూచించారు. రైతులు ఆత్మీయంగా చర్చించి తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. గ్రామ పెద్దలు రైతుల సాధికారత కోసం ఈ విధమైన కార్యక్రమాలు కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకుడు ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి అత్తే సుధాకర్, విస్తరణ అధికారి అరుణ్ కుమార్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల
