school bus
school bus

School Bus Fitness: బడిబస్సు భద్రమేనా?

  • మరో వారంలో ప్రారంభం కానున్న పాఠశాలలు
  • మంచిర్యాల జిల్లాలో విద్యాసంస్థల వాహనాలు 509
  • ఫిట్ నెస్ కు వచ్చినవి 141 మాత్రమే
  • రెన్యూవల్‌కు రానివి 242 వాహనాలు
  • 15 ఏళ్లు దాటిన వాహనాలు-126
  • ఫిట్ నెస్ లేకుండా రోడ్డెక్కితే చర్యలు తప్పవంటన్న అధికారులు
shool bus
shool bus

School Bus Fitness: మరో వారం రోజుల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. మరో ఏడు రోజుల్లో విద్యా సంస్థలు పున: ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. జూన్ రావడంతో తల్లిదండ్రులు తమ పిల్లల చదువులు, ఖర్చుల గురించి ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. ఇక విద్యా సంస్థలు ముఖ్యంగా పాటించాల్సిన వాటిలో అతి ముఖ్యమైనది వాహనాల ఫిట్ నెస్.
మెజార్టీ ప్రైవేట్ పాఠశాలలు తమ పాఠశాలలో విద్యార్థులను సొంత వాహనాల్లోనే తరలిస్తున్నాయి. అయితే కొన్ని స్కూళ్ల నిర్వాహకులు తమ బస్సులను ఫిట్‌నెస్‌ చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. పాఠశాలల పునఃప్రారంభానికి కేవలం వారం మాత్రమే గడువు ఉంది. ఆలోగా ఫిట్‌నెస్‌ చేయించుకోవాలని జిల్లా అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డెక్కితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

మంచిర్యాల జిల్లాలో మొత్తం 509 బస్సులు పాఠశాలల కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు ఫిట్‌నెస్‌ కండీషన్‌ పూర్తయినవి మాత్రం కేవలం 141 మాత్రమే. మరో 242కు పైగా బస్సులు ఫిట్‌నెస్‌ పూర్తి చేయించుకోవాల్సి ఉంది. వీటిలో 126 బస్సులు 15 ఏళ్లు దాటిపోయింది. దీంతో వాటిని ఫిట్‌నెస్‌ చేయించడానికి వీలుండదు.

shool bus
shool bus

మరో ఐదు రోజులే..
పాఠశాలలు పునఃప్రారంభానికి కేవలం మరో ఐదు రోజుల గడువు మాత్రమే ఉన్నది. కానీ చాలా వరకు పాఠశాలల బస్సులను ఫిట్ నెస్ చేయించేందుకు నిర్వాహకులు ముందుకు రావడం లేదు. దాదాపు ఇప్పటి వరకు ఉన్న సంఖ్యలో కనీసం సగం కూడా ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించలేదు. చాలా మంది స్కూళ్ల యజమానులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు.

రోడ్డెక్కితే కేసులే
మంచిర్యాల జిల్లా పరిధిలోని వేంపల్లిలో ఉన్న జిల్లా రవాణా శాఖ(District Transport Department) కార్యాలయానికి ఫిట్‌నెస్‌ తనిఖీ కోసం విద్యా సంస్థల నిర్వాహకులు తమ బస్సులను తీసుకు వస్తున్నారు. ఈ బస్సులను రవాణా శాఖ ఇన్‌స్పెక్టర్లు క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. బడి పిల్లలను భద్రంగా గమ్యానికి తీసుకెళ్లడానికి కావాల్సిన అన్ని వసతులు, కండీషన్‌ లో ఉంటేనే అధికారులు ఫిట్‌నెస్‌ రెన్యువల్‌ చేస్తున్నారు. లేదంటే తిరిగి పంపించేస్తున్నారు. టైర్లు, నెంబర్‌ప్లేట్‌, లైట్లు, రేడియం, సీట్లు, కలర్‌, ఇలా ప్రతీ ది క్షుణ్ణంంగా తనిఖీ చేస్తున్నారు. డ్రైవర్ల అనుభవం, నైపుణ్యాన్ని కూడా పరీక్షిస్తున్నారు. అలాగే అధికారులు పలు సూచనలు కూడా చేస్తున్నారు. ఫిట్‌నెస్‌ లేకుండా స్కూల్ బస్సులు రోడ్డెక్కితే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫిట్‌నెస్‌ రెన్యూవల్ చేయించకుండా బస్సులు బయటికి తీస్తే భారీ జరిమానాలు విధిస్తామని స్పష్టం చేస్తున్నారు. గత సంవత్సరం కూడా బస్సులు సీజ్‌ చేసిన విషయాన్ని గుర్తుంచుకొని ఫిట్‌నెస్‌ తప్పనిసరిగా చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. స్కూళ్లు ప్రారంభమయ్యాక పాఠశాలల బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని చెబుతున్నారు.

నిబంధనలు పాటించాలి

పాఠశాలలు, కళాశాలలు మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. మెజార్టీ విద్యా సంస్థల నిర్వాహకులు తమ వాహనాల ఫిట్‌నెస్‌ చేయించుకోవడంలేదు. విద్యా సంస్థలు ప్రారంభమైన తర్వాత స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతాం. సామర్థ్య ధ్రువీకరణ పొందని వాహనాలపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్క బస్సు నిబంధనలు పాటించాల్సిందే. అలాగే ఫిట్‌నెస్‌ కోసం వచ్చే వాహనాల్లో ఏ ఒక్క పరికరం లేకున్నా నోటీసు ఇస్తున్నాం.రిపేర్‌ చేసుకొని తీసుకు రమ్మని చెబుతున్నాం. అన్ని విద్యాసంస్థల వాహనాలు పాఠశాలల పునఃప్రారంభానికి ముందే ఫిట్‌నెస్‌ చేయించుకునేలా చూడాలి. ఈ విషయమై పదిహేను రోజుల ముందు నుంచే అవగాహన కల్పిస్తున్నాం.
సంతోష్ కుమార్ ఇన్చార్జి డీటీఓ

 

జూన్ 12 నుంచి స్పెషల్ డ్రైవ్

mvi
mvi

స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై ఈ నెల12 నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేస్తాం. విద్యా సంస్థల నిర్వాహకులు తమ వాహనాలకు ఫిట్ నెస్ చేయించుకొని సహకరించాలి.పిల్లల భద్రతకు భరోసా ఇవ్వాలి.
ఎంవీఐ. కిశోర్ చంద్రారెడ్డి

 

– శెనార్తి మీడియా, మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *