- సుమోటోగా కేసు నమోదు
- ప్రాంతీయ పత్రికలో వచ్చిన కథనంపై స్పందన
TGHRC: హైదరాబాద్‌లో వరుసగా జరుగుతున్న విద్యుత్ షాక్ ఘటనలపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ ఘటనలపై ఓ ప్రాంతీయ పత్రికలో వచ్చిన కథనాన్ని పరిశీలించిన కమిషన్, నగరంలోని సాగర్ రోడ్ ప్రాంతం సహా పలు చోట్ల ప్రమాదకరంగా మారిన విద్యుత్ లైన్ల వల్ల ప్రాణాపాయం పొంచి ఉందని పేర్కొంది.
జనజీవితానికి ప్రమాదం
విద్యుత్ పంపిణీ సంస్థల నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నదని, పిల్లలు, కూలీలు కూడా ప్రమాదానికి గురవుతున్నారని నివేదికలో స్పష్టంగా ఉన్నట్టు కమిషన్ పేర్కొంది. ఇది భారత రాజ్యాంగంలోని 21వ అధికరణంలో ఉన్న జీవన హక్కుకు విరుద్ధంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రభుత్వానికి నోటీసులు
ఈ నేపథ్యంలో ఎనర్జీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి వాస్తవ నివేదికను కోరుతూ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. నాలుగు ప్రధాన అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరింది. ఈ నివేదిక జూలై 28 ఉదయం 11 గంటలలోగా సమర్పించాల్సిందిగా స్పష్టం చేసింది.
నివేదికలో కోరిన అంశాలు
- గత రెండు సంవత్సరాల్లో విద్యుత్ షాక్‌తో సంభవించిన మరణాలు, గాయాలపాలైన వారి సంఖ్య
- తీసుకున్న జాగ్రత్తలు, భద్రతా చర్యలు
- నివాస ప్రాంతాలు, మురికి వాడ ప్రాంతాల్లో ప్రమాదకరమైన ఎలక్ట్రిక్ లైన్ల తొలగింపు లేదా మార్పు చర్యలు
- బాధితులకు లేదా కుటుంబాలకు చెల్లించిన నష్టపరిహార వివరాలు
ఇటీవలి విషాద ఘటన
ఇద్దరు వ్యక్తులు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న సమయంలో, హెవీ టెన్షన్ వైర్లు తెగి పడటంతో విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి ఈ చర్యలు తీసుకున్నట్టు సమాచారం.
-శెనార్తి మీడియా, హైదరాబాద్
