ricemilll
ricemilll

JPV Verification: మిల్లుల్లో ఫిజికల్ వెరిఫికేషన్ జరిగేనా..?

  • ఆమ్యామ్యాలకు ఆశపడి తూతూ మంత్రంగా జరుపుతారా..!
  • ఈ నెల 6లోపు 30 మిల్లుల్లో లెక్కింపు సాధ్యమేనా..?
  • ఆందోళన చెందుతున్న మిల్లర్లు…
  • ముందుగానే అసోసియేషన్ తో మంతనాలు షురూ

JPV Verification: జిల్లాలో జాయింట్ ఫిజికల్ వెరిఫికేషన్ (జేపీవీ) చేయాలని కమిషనరేట్ నుంచి ఆదేశాలు అందినప్పటి నుంచి జిల్లాలోని అగ్ర భాగం మిల్లర్లు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో 2024 – 25 వానా కాలం సీజన్ కు సంబంధించి మిల్లుల్లో దిగిన సీఎంఆర్ ధాన్యం భద్రంగా ఉందో..! లేదో..! తెలుసుకునేందుకు సివిల్ సప్లయ్ కమిషనర్ కార్యాలయం నుంచి ఆదేశాలందాయనే సమాచారం తెలుసుకున్న కొందరు మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. ఇక చేసేదేమి లేక మిల్లర్ అసోసియేషన్ నాయకుల ద్వారా అధికారుల చేతులు తడిపే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మిల్లుల్లో ఫిజికల్ వెరిఫికేషన్ జరిగేనా..?

కమిషనరేట్ ఆదేశాల మేరకు జిల్లాలోని 30 మిల్లుల్లో ఎఫ్సీఐ అధికారులతో పాటు పౌరసరఫరాల శాఖ, పౌర సరఫరాల సంస్థ సభ్యులు జాయింట్ ఫిజికల్ వెరిఫికేషన్ (జేపీవీ) చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ ఈ నెల ఆరవ తేదీలోపు చేసి నివేధికను ఉన్నతాధికారులకు అందజేయాల్సి ఉంది. అధికారులు ఇచ్చిన నివేధిక ఆధారంగానే సీఎంఆర్ పెట్టేందుకు మిల్లర్లకు గడువు ఇవ్వాలా..! వద్దా..! అనేది ఉన్నతాధికారులు నిర్ణయించనున్నారు. అధికారులు మిల్లర్లు ఇచ్చే ఆమ్యామ్యాలకు ఆశపడి ఫిజికల్ వెరిఫికేషన్ చేకుండానే ధాన్యం ఉందనే రిపోర్టు ఇచ్చే అవకాశాలున్నాయని పలువురు మిల్లర్లే పేర్కొంటున్నారు.

ఈ నెల 6లోపు 30 మిల్లుల్లో లెక్కింపు సాధ్యమేనా..?

జిల్లాలోని మిల్లుల్లో జాయింట్ ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని సివిల్ సప్లయ్ కమిషనరేట్ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినా ఇప్పటి వరకు ఇంకా మొదలే పెట్టలేదు. ఈ నెల ఆరవ తేదీలోపు 2024‌-25 వానా కాలం సీఎంఆర్ కింద ధాన్యం దించుకున్న 30 మిల్లుల్లో ఉండాల్సిన 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం బస్తాలను కౌంటింగ్ చేయడం సాధ్యపడని విషయం. మిల్లర్లను రక్షించేందుకే అధికారులు జిల్లాలో తనిఖీలు మొదలు పెట్టడం లేదనే ఆరోపణలు సైతం మరో వైపు వినిపిస్తున్నాయి. తనిఖీల పేరిట మిల్లర్ల నుంచి డబ్బులు దండుకునేందుకే అధికారులు కాలయాపన చేస్తూ 30 మిల్లుల యాజమానుల నుంచి తలోకొంత గుంజే ప్రయత్నాలు మిల్లర్ అసోసియేషన్ నాయకుల నుంచి జరుపుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆందోళన చెందుతున్న మిల్లర్లు

సీఎంఆర్ కింద జిల్లాలో 30 బాయిల్డ్, రా రైస్ మిల్లులకు 78,879 మెట్రిక్ టన్నులు కేటాయించారు. మిల్లింగ్ చేసి 53,120 మెట్రిక్ టన్నుల (1832 ఏసీకేల) బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 32,891 మెట్రిక్ టన్నులు (1134 ఏసీకేలు) అందజేశారు. ఇంకా 20,229 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. మిల్లుల్లో ధాన్యం ఉంటే ఈపాటికి కొంతలో కొంతైనా అంటే కనీసం 50 శాతం బియ్యం ఇచ్చేవారు. లేకపోవడం వల్లనే సీఎంఆర్ ఇవ్వడం లేదనేది సంబంధిత శాఖ అధికారులకు సైతం తెలుసు. జాయింట్ ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే మిల్లుల్లో ధాన్యం ఉందో..! లేదో…! ధాన్యం షార్టేజీ ఎంత ఉందో తెలిసే అవకాశాలున్నాయి. సక్రమంగా తనిఖీలు చేస్తే మా పని అంతేనని ధాన్యం అమ్ముకున్న మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు.

అసోసియేషన్ నాయకులతో మంతనాలు..?

ధాన్యం అమ్ముకున్న మిల్లర్లు వెరిఫికేషన్ కు రాకుండానే ధాన్యం ఉన్నాయనే నివేదిక ఇప్పించేందుకు అసోసియేషన్ నాయకులతో మంతనాలు జరుపుతూ వారు అడిగింది ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారనే ఆరోపణలు అధికంగా వినిపిస్తున్నాయి. అధికారుల చేతులు తడిపేందుకు అసోసియేషన్ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా వానా కాలం వడ్లు అమ్ముకున్న కొంత మంది మిల్లర్లకు యాసంగిలో సైతం సీఎంఆర్ బియ్యం ఇచ్చారని సక్రమంగా బియ్యం ఇచ్చిన పలువురు మిల్లర్లు ఆరోపిస్తున్నారు. తనిఖీలకు వెళ్లే అధికారులు వానా కాలం, యాసంగి సీజన్ ల ధాన్యాన్ని వేరు వేరుగా కౌంటింగ్ చేయిస్తే దొంగలు ఇట్టే దొరుకుతారని బాహాటంగానే పేర్కొంటున్నారు.

శెనార్తి మీడియా, మంచిర్యాల

circular
circular

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *