- స్పెషల్ పార్టీ సిబ్బందికి టాక్టికల్ ట్రైనింగ్
- గ్రేహౌండ్స్ తరహాలో తర్ఫీదు
- రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్
Ramagundam CP: అసాంఘిక శక్తుల ఏరివేతకు స్పెషల్ పార్టీ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో స్పెషల్ పార్టీ సిబ్బందికి గ్రేహౌండ్స్ తరహా శిక్షణ కార్యక్రమానికి సీపీ శ్రీనివాస్ శనివారం హాజరయ్యారు. ముందుగా ఆర్ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మహిళా కమాండోలు పుష్ప గుచ్ఛాలు అందించి సీపీకి స్వాగతం పలికారు. సీపీ అధికారులతో కలిసి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లారు. వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు, నక్సలైట్ల ఏరివేతకు గ్రేహౌండ్స్ సిబ్బంది శిక్షణ తరహాలో రామగుండం పోలీస్ కమీషనరేట్ స్పెషల్ పార్టీ, క్యూఆర్టీ సిబ్బందికి ఫిజికల్ ఫిట్నెస్, స్క్వాడ్ డ్రిల్, అర్మ్స్ డ్రిల్, ఆయుధ వినియోగం, కోల్ నా, జోల్ నా, పార్ట్స్ నేమ్స్, పార్ట్స్ పనితీరు, అడవుల్లో పోరాటంపై ప్రధానంగా బలగాలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఫీల్డ్ క్రాఫ్ట్, మ్యాప్ ఇంట్రడక్షన్, స్కేల్, మ్యాప్ రిఫరెన్స్, నావిగేషన్, కమ్యూనికేషన్, టూల్స్, టాక్టికల్ మూవ్మెంట్, కూంబింగ్, ఇంటెలిజెన్స్ నెట్వర్క్, అడవుల్లో సంచరిస్తూ మావోల కదలికలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి సారించాలి అన్నారు.
అవసరాన్ని బట్టి అనుసరించాల్సిన టాక్టికల్ ఆపరేషన్స్ వ్యూహం కోణంలో శిక్షణ ఇచ్చే విషయమై ఇందుకు ప్రత్యేక శిక్షణ, మెళకువలతో కూడిన శిక్షణ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. ఈ శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ట్రైనర్ల నుంచి కొత్త విషయాలు అడిగి తెలుసుకోవాలన్నారు. శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. అదే విధంగా శిక్షణ సమయంలో అన్ని విభాగాల్లో ప్రతిభ చూపిన సిబ్బందికి రివార్డులు అందించనున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీ రాజు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సుందర్ రావు, ఆర్ ఐ లు దామోదర్, శ్రీనివాస్, సంపత్, మల్లేశం, ఆర్ఎస్ ఐ లు, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల/గోదావరిఖని