- మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేం సాగర్ రావు
KADEM LIFT : జిల్లాలోని గూడెం ఎత్తిపోతల పథకం కింద యాసంగి సీజన్ లో చివరి ఆయకట్టు వరకు వరి పంటకు సాగునీరు అందిస్తామని మంచిర్యాల నియోజక వర్గ శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శని వారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో రైతు సంఘాల నాయకులు, రైతులతో యాసంగి పంటకు సాగునీటి విడుదలపై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ బద్రినారాయణ, డిఈ దశరథంలతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. జిల్లాలోని గూడెం ఎత్తిపోతల పథకం కింద యాసంగి పంట చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. సాగునీటి విడుదలలో ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రైతులు సైతం నీటి వృధాను నివారించేందుకు తమ వంతు కృషి చేయాలన్నారు. ఇందుకు అవసరమైన మెళకువలను సంబంధిత అధికారుల ద్వారా తెలుసుకోవాలని సూచించారు. గూడెం ఎత్తిపోతల పథకం కింద 69 వేల ఎకరాలు ఆయకట్టు సాగవుతుందని, రైతుల సౌకర్యార్థం సాగునీటిని దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల పరిధిలో రెండున్నర రోజులు, హాజీపూర్ మండల పరిధిలో రెండు రోజుల పాటు విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 5 నుంచి ఏప్రిల్ 25 వరకు నీటిని అందించడం జరుగుతుందని రైతులకు తెలిపారు. ఈ సమిక్షా సమావేశంలో నీటి పారుదల శాఖ ఎఈఈ.లు జాకీర్, రాజేందర్, కీర్తి, సంబంధిత అధికారులు, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల.