- సింగరేణిలో కవిత కొత్త వ్యూహం
- హెచ్ఎంఎస్‌తో కలసి కార్యాచరణకు రంగం సిద్ధం
MLC Kavitha:సింగరేణి కార్మిక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కార్మికుల మద్దతు కోసం సింగరేణిలో కొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, హెచ్ఎంఎస్ యూనియన్ నేతలతో చర్చలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, సింగరేణి కార్మిక నాయకుడు రియాజ్ అహ్మద్‌ను కవిత హైదరాబాద్‌లోని తన నివాసంలో రహస్యంగా కలిశారు.
ఈ సమావేశంలో సింగరేణి కార్మికుల సమస్యలు, హక్కుల రక్షణ, ఉద్యోగ భద్రత, కాంట్రాక్ట్ కార్మికుల పునర్నియమకాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా తెలంగాణ జాగృతి సంస్థతో హెచ్ఎంఎస్ కలసి పనిచేసే అంశంపై ఫోకస్ చేసినట్టు సమాచారం. సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని రియాజ్ అహ్మద్ పలు మీడియా సంస్థలకు వెల్లడించారు.
ఇటీవల కవిత ‘సింగరేణి జాగృతి’ పేరిట కొత్త సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పలువురు కోఆర్డినేటర్లను నియమించారు. ఇప్పటికే బీఆర్ఎస్ అనుబంధంగా టీబీజీకేఎస్ పనిచేస్తున్నా, మరో కొత్త సంఘాన్ని ఏర్పాటు చేయడంపై కార్మిక వర్గాల్లో అనేక అనుమానాలు మొదలయ్యాయి. సింగరేణిలో బలమైన రాజకీయ ప్రాతినిధ్యం కోసం కవిత అడుగు ముందుకు వేసినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కవిత రాజకీయంగా తన పునరాగమనం కోసం సింగరేణిని ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకునే ప్రయత్నంలో ఉన్నట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కేసీఆర్‌కు లేఖ రాసిన తర్వాత తన మొదటి పర్యటనను నల్లనేల ప్రాంతంలో ప్రారంభించిన కవిత, తన వెంటే ఎవరు వస్తారు, బలాబలాలేంటన్నది నిశితంగా గమనిస్తూ వ్యూహాత్మకంగా ముందడుగు వేసినట్టు తెలుస్తున్నది.
ఈ నెల 10న హెచ్ఎంఎస్ నేతలు, సింగరేణి జాగృతి ప్రతినిధులు మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ సమావేశం ద్వారా కొత్త కూటమికి స్పష్టమైన రూపం లభించే అవకాశముంది. కార్మిక సంఘాల మద్దతుతో రాజకీయంగా తమ ప్రాధాన్యతను నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో కవిత ఈ ప్రయత్నాల్లో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తున్నది.
-శెనార్తి మీడియా,మంచిర్యాల:
