Chakali Ilamma
Chakali Ilamma: చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేస్తున్న నాయకులు

Chakali Ilamma:చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

Chakali Ilamma: చాకలి (చిట్యాల) ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు నస్పూర్ మున్సిపాలిటీలో మండల అధ్యక్షులు దొడ్డిపట్ల రవీందర్, కార్యదర్శి పుట్టపాక తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షులు రాగళ్ల రాజయ్య, నగునూరు సారయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా మండల అధ్యక్షులు రవీందర్ మాట్లాడుతూ… రాష్ట్రంలోని రజకుల ప్రధాన సమస్యలు, డిమాండ్లను వివరించారు. దేశంలో ఇప్పటికే 18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చినందున తెలంగాణలో కూడా ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ చేసుకున్న రజక సొసైటీలకు ఒక్కో సంఘానికి 30 లక్షల సబ్సిడీ రుణాలు ఖాతాల్లో జమ చేయాలని కోరారు. 55 సంవత్సరాలు నిండిన రజకులకు నెలకు 4 వేల రూపాయల పెన్షన్ మంజూరు చేయాలని తెలిపారు.

రాష్ట్రంలో రజక జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు చేయాలని, ప్రధాన గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మండల, జిల్లా కేంద్రాల్లో రజక సంక్షేమ భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. రజక ఫెడరేషన్‌కు పాలక మండలి ఏర్పాటు చేసి, రజకులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు సాంఘిక భద్రతా చట్టం తీసుకురావాలని కోరారు.

రజక వృత్తిదారుల దోబీగాట్లను పరిరక్షించి, మౌలిక వసతులు కల్పించాలని, ప్రస్తుతం అమల్లో ఉన్న ఉచిత విద్యుత్‌ను 250 యూనిట్ల నుంచి 500 యూనిట్లకు పెంచాలని డిమాండ్ చేశారు. దోబీగాట్ లేని చోట స్థలం కేటాయించి, పూర్తి వసతులతో ఏర్పాటు చేయాలని కోరారు.

ట్యాంక్‌బండ్‌పై వీరవనిత ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, జనగామ జిల్లాకు ఆమె పేరు పెట్టాలని సూచించారు. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఆదేశాలను అన్ని శాఖల ద్వారా అమలు చేయాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో బట్టలు ఉతికే కాంట్రాక్టులను రజకులకు కేటాయించాలని కోరారు. విద్య, వైద్యం, ఉపాధి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. నస్పూర్ మున్సిపాలిటీలో రజక భవనం నిర్మించాలని మండల నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి నేదునూరు మహేష్, మండల ఉపాధ్యక్షులు కొండపాక శ్రీనివాస్, నస్పూర్ కాలనీ గౌరవ అధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస్, బూసరాజు నాగేందర్, పాయురాల వెంకటేష్, నగునూరు అనిల్ తదితరులు పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *