PUTTA MADHU
మాట్లాడుతున్న బీఆర్ఎస్ మాజీ ఎంఎల్ఏ పుట్ట మధు

PUTTA MADHU : పోలీసులు మారాలి.. ప్రజల కోసం పని చేయాలి…

  •  నేపాల్‌ పరిస్థితి మంథనిలో రాకుండా చూడాలి…
  •  ప్రజలకు ఒక్క శాతం పని చేయని మంథని ఎమ్మెల్యే
  •  బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు

PUTTA MADHU : ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధులను సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నించే హక్కు ఉందని హైకోర్టు తీర్పు ఇచ్చిన క్రమంలో మంథని నియోజక వర్గంలో పోలీసులు మారక పోతే మంథని నుంచే ప్రళయం మొదలవుతుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మదూకర్‌ అన్నారు. గురు వారం మంథనిలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజక వర్గంలో పోలీసుల అరాచకాలు పెరిగిపోతున్నాయని, దుద్దిల్ల కుటుంబానికి ఎప్పుడు పదవులు వస్తే అప్పుడు వాళ్ల నిజస్వరూపాలను చూపించడం పరిపాటిగా మారిందన్నారు. ఆ కుటుంబానికి వత్తాసు పలికే పోలీసులను ఇప్పటికే అనేకమార్లు అప్రమత్తం చేశామని ఆయన గుర్తు చేశారు. పోలీసుల్లో ఎస్సీలు, బీసీలున్నారని, వారిని వాడుకుని కరివేపాకులా పడేయడం దుద్దిల్ల కుటుంబానికి అలవాటేనని, ప్రేమ ఆప్యాయతలు ఉండవని, ఎదుటివారిపై మిమ్మల్ని ఉపయోగించుకునేందుకు వినియోగించుకుంటారన్నారు.

420 హామీలు ఏమయ్యాయి…

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 21నెలలు గడుస్తున్నా 420 హామీలకు మానీఫెస్టో కమిటి చైర్మన్‌గా ఉన్న మంథని ఎమ్మెల్యే యూత్‌, మహిళా, రైతు డిక్లరేషన్‌ల గురించి ఆలోచన చేయడం లేదని బీఆర్ఎస్ మాజీ ఎంఎల్ఏ మధు అన్నారు. వృద్దులు, వికలాంగులు పించన్‌ పెంపు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. మంథని నియోజక వర్గాన్ని సింహబాగం మంథని ఎమ్మెల్యేగా ఆయన తండ్రి పాలించారని, ప్రస్తుతం 21 నెలలు గడిచినా ఈ ప్రాంతంలో 21 కార్యక్రమాలు చేయలేదని, 21 మందికి ఉద్యోగాలు ఇప్పించలేదని విమర్శించారు.

నేపాల్‌ పరిస్థితి మంథనిలో రాకుండా పోలీసులు మారాలి

సోషల్‌ మీడియా విషయంలో పోలీసులు, ప్రభుత్వం అత్యుత్సాహం చూపిస్తోందని, ఇప్పటికే అనేక మందిపై కేసులు నమోదు చేశారని మాజీ ఎంఎల్ఏ మధు దుయ్యబట్టారు. నేపాల్‌లో యువత ‘మా ఆకలి తీర్చాలని, ప్రభుత్వం ఆలోచన చేయడం లేదని, మా ఆశీస్సులతో విలాసాలు గడుపుతున్నారని’ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే అది జీర్ణించుకోలేని ప్రభుత్వం ఆంక్షలు పెట్టిందని, కానీ ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితులను ప్రభుత్వం ఎదుర్కొంటుందో మనం చూస్తూనే ఉన్నామన్నారు. అలాంటి పరిస్థితి మంథనిలో పునరావృతం కాకుండా పోలీసులు, ప్రభుత్వం, ముఖ్యంగా మంథని ఎమ్మెల్యే కండ్లు తెరువాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సోషల్‌ మీడియాలో నల్లబాలు అలియాస్‌ శశిధర్‌ అనే వ్యక్తి ‘కాంగ్రెస్‌ పాలన రాష్ట్రానికి చీడపురుగులాంటిదని’ వ్యాఖ్యానిస్తూ పోస్టు పెడితే అతనిపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని, ఈ విషయంలో హైకోర్డు కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. తొమ్మిది రాష్ట్రాల్లో కేసులను పరిశీలిస్తే కేసులన్నీ కానిస్టేబుళ్లు ఎఫ్‌ఐఆర్‌ చేస్తున్నారని తేలిందని, ఇది అవమానకరమని హైకోర్డు వెల్లడించిందన్నారు. అంతే కాకుండా ఎవరి మీదనైతే ఆరోపణలు చేస్తారో ఆ వ్యక్తి స్వయంగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పిందన్నారు. హైకోర్డు తీర్పు వెలువరించిన క్రమంలో మంథని పోలీసుల్లో మార్పు రావాలన్నారు. భారత రాజ్యాంగం మాత్రమే మీకు ఉద్యోగాలు ఇచ్చిందని, కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వమో, రేవంత్‌ రెడ్డో, దుద్దిల్ల శ్రీధర్‌బాబో మీకు ఉద్యోగాలు ఇవ్వలేదనే విషయాన్ని గుర్తించాలన్నారు.

ప్రజలకు ఒక్క శాతం పని చేయని మంథని ఎమ్మెల్యే

నియోజక వర్గంలో అత్యధికంగా ఉన్న ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే వారికి ఒక్కశాతం కూడా మంథని ఎమ్మెల్యే పని చేయలేదని మాజీ ఎంఎల్ఏ మధు విమర్శించారు. నాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తే మంచి పదవులు వస్తాయేమో కానీ పోలీసులు జైలుకు పోతే వాళ్ల కుటుంబాలు రోడ్డున పడుతాయనే విషయాన్ని గమనించాలన్నారు. పోలీసులకు ఏమైనా జరిగితే మంత్రి శ్రీధర్‌ బాబో ఆయన సోదరుడు జోకర్‌ శ్రీనో వచ్చి కాపాడరని గుర్తు చేశారు. యూరియా కోసం రైతులు నానా తంటాలు పడుతున్నారని, యూరియా బస్తాలను కాంగ్రెస్‌ నాయకులకు ఇచ్చి రైతులను గోసపెడుతున్న దుద్దిళ్లపై కేసు పెట్టాలన్నారు. మహిళా సంఘాల మీటింగ్‌లకు పోయి బెల్ట్‌షాపులు బంద్‌ చేయిస్తం, రూ. 500 బోనస్‌ ఇస్తమని, అవసరమైతే సోనియమ్మ దగ్గరకు పోతామని గొప్పలు చెప్పుకున్నారని, వాటిని అమలు చేయడంపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

శెనార్తి మీడియా, మంథని / పెద్దపల్లి :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *