- పెద్ద మనుషుల పేరిట దోపిడీ
- పంచాయితీ పెడితే ఇరు వర్గాల నుంచి రూ. 50 వేల నుంచి రూ. లక్ష దాకా ఇవ్వాల్సిందే..
- న్యాయం కోసం ఆశ్రయిస్తే ముక్కు పిండి మరీ వసూలు
- దండేపల్లిలో చర్చనీయాంశం
Jamanth Dandha: మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పెద్ద మనిషి తన వద్దకు వచ్చిన పంచాయితీల్లో జమానత్ పేరిట భారీగా వసూళ్లకు పాల్పడినట్లు స్థానికంగా తీవ్ర చర్చ నడుస్తోంది. పంచాయితీలకు వచ్చిన పెద్దమనుషులే దోపిడీకి పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
దండేపల్లి మండలంలోని ఓ గ్రామస్థాయి నాయకుడిని పంచాయితీకి పిలిస్తే జమానత్ పేరుతో వ్యక్తుల వద్ద ఒక్కొక్కరి నుండి రూ.50 వేల నుండి లక్ష వరకు వసూలు చేశారనే ప్రచారం సాగుతున్నది. ప్రస్తుతం ఇదే వ్యక్తి ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా రంగంలోకి రావడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది. ఈ మధ్య కాలంలో జమానత్ పేరిట పది లక్షల రూపాయల వరకు వసూలు చేశాడనే గుసగుసలు మండలంలో జోరుగా వినిపిస్తున్నాయి.
ఈ పంచాయితీలో బాధితుల్లో ఎంత మందికి న్యాయం జరిగిందో తెలియదు కానీ.. జమానత్ పేరిట మాత్రం కాస్త గట్టిగానే పిండుకున్నాడని ఆ గ్రామంలో చర్చ సాగుతున్నది. ఎంత మంది ఈ పంచాయితీ పెద్ద మనిషి చేతిలో బలయ్యారనేది వెలుగులోకి రావాల్సి ఉంది. గతంలో ఇక్కడ పని చేసిన ఓ ఎస్ఐని మభ్య పెట్టి ఈ తతంగం ఎక్కువగా జరిగినట్టు స్థానిక సమాచారం. పోలీస్ స్టేషన్‌కు పిటిషన్‌తో వెళ్లిన వారికి బయటే పంచాయితీలు చేసుకుని రావాలని సూచించిన సందర్భాలు ఉన్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జమానత్ పేరిట వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి వెళ్లాయి? ఎవరి చేతుల్లో ఆగిపోయాయి? అని బాధితులు ప్రశ్నిస్తున్నా… సమాధానం మాత్రం రావడం లేదు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల(దండేపల్లి)
