- 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలి
- నాణ్యత, రక్షణతో కూడిన ఉత్పత్తికి ఏరియా జీఎంలు చర్యలు తీసుకోవాలి
- వేసవి విద్యుత్ డిమాండ్ మేరకు థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేయాలి
- సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ఆదేశం
Singareni CMD: పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ప్రతీ రోజూ 2.6 లక్షల టన్నులకు తగ్గకుండా బొగ్గు (Coal) ఉత్పత్తి (Production) , రవాణా చేయాలని సంస్థ సీఎండీ ఎన్.బలరామ్(CMD Balaram Naik) ఆదేశించారు. రోజుకు కనీసం 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలని, దీంతో బొగ్గు ఉత్పత్తిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. శనివారం హైదరాబాద్ సింగరేణి భవన్ (Singareni Bhavan) నుంచి అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేసవి సమీపిస్తుండడంతో దేశంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నదని, దీనిని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏరియాలు కూడా ప్రణాళికాబద్ధంగా ఉత్పత్తి పెంచాలని సీఎండీ సూచించారు.
కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి వస్తున్న డిమాండ్ మేరకు నిత్యం 11 రేకులకు తగ్గకుండా బొగ్గు సరఫరా చేయాలన్నారు. అలాగే సింగరేణి తో ఇంధన సరఫరా ఒప్పందాలు ఉన్న అన్ని విద్యుత్ కేంద్రాలకు తగినంత బొగ్గు సరఫరా చేయాలని ఆదేశించారు. బొగ్గు సరఫరా విషయంలో రైల్వే విభాగంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. కొత్తగూడెం ఏరియా మెరుగైన ఉత్పత్తి సాధించడంపై ఏరియా అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. లక్ష్యాల సాధనలో వెనుకబడి ఉన్న ఏరియాలు పుంజుకొని పనిచేయాలని సూచించారు. బొగ్గు ఉత్పత్తి సాధనలో నాణ్యత, రక్షణకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
నాణ్యమైన బొగ్గును మాత్రమే వినియోగదారులకు సరఫరా చేయాలన్నారు. అలాగే ప్రతీ కార్మికుడు కూడా స్వీయ రక్షణ పాటించేలా అవగాహన కల్పించాలని సూచించారు. నాణ్యత, రక్షణ విషయంలో ఏరియాలోని అన్ని స్థాయిల అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో జీఎం(కో ఆర్డినేషన్) ఎస్డీ ఎం.సుభానీ, జీఎం(మార్కెటింగ్) రవి ప్రసాద్, జీఎం(సీపీపీ) మనోహర్, అన్ని ఏరియాల జీఎంలు, కార్పొరేట్ జీఎంలు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల
