- నిరుద్యోగులకు మోచేతికి బెల్లం రాసి నాకిచ్చినంత పనిచేసింది…
- టీచర్ల సమస్యలపై పోరాడింది తపస్ ఒక్కటే…
- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
MLC CAMPAIGN : ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ది చెప్పాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మంగళ వారం సాయంత్రం పట్టణంలోని తాండ్ర పాపారాయుడు ఫంక్షన్ హాలులో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.
సమస్యలపై పోరాడేది బీజేపీ నాయకులేనని, 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు బీజేపీకి మాత్రమే ఉందని, 317 జీవోకు వ్యతిరేకంగా కొట్లాడింది, లాఠీ దెబ్బలు తిన్నది, రక్తం చిందించింది, జైలుకు పోయింది బీజేపీ నాయకులేనన్నారు. టీచర్ల సమస్యలపై తపస్ పోరాడుతుంటే పీఆర్టీయూ, ఎస్టీయూ, యూటీఎఫ్, డీటీఎఫ్ సహా ఏ ఒక్క సంఘమైనా అండగా నిలిచారా? అని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఉద్యోగులు, టీచర్లు, నిరుద్యోగులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉండేది మేమేనని, పోరాడేది కూడా బీజేపీ నాయకులేనన్నారు.
ధర్మానికి, సమాజానికి ఆపదొచ్చినా బీజేపీయే అండగా నిలుస్తుందన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వంపై విశ్వాసం, భరోసా ప్రజలకు ఉందని, ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కోసం పట్టభద్రులు, ఉద్యోగ, ఉపాధ్యాయులంతా ఎదురు చూస్తున్నారని, మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఆశా భావం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులందరికీ రూ.12.75 లక్షల ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. 10 ఏళ్లలో రూ.12 లక్షల కోట్లకుపైగా నిధులను కేటాయించి తెలంగాణ అభివృద్దికి కృషి చేస్తోందని, అయినా కేంద్రం నిధులివ్వడం లేదని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుందని, కేంద్ర నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? ఇదే అంశాన్ని రెఫరెండంగా తీసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి రావాలని కాంగ్రెస్ కు సవాల్ విసిరారు.
కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్ధి పరిస్థితి గందరగోళంగా మారిందని, ఆయనకు ఏజెంట్లు లేరని, ప్రచారం చేసే నాయకులు లేరన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆయనకు గెలిపించాలనే ఆలోచనే పూర్తిగా లేదన్నారు. చివరకు ఆయన సొంత కాలేజీ స్టాఫ్ ను పట్టుకుని తిరుగుతున్నాడని, ఆయన గెలిస్తే ఉన్న ఉద్యోగాలు పోతాయోమోననే సొంత స్టాఫ్ గందరగోళంలో ఉన్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకైతే మోచేతికి బెల్లం రాసి నాకిచ్చినంత పనిచేసిండ్రని కేంద్ర మంత్రి సంజయ్ అన్నారు. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నరు, నెలనెలా రూ. నాలుగు వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నరు, ఉపాధికి ఢోకా లేకుండా చేస్తమన్నరు, ఇయాళ్టికి నయాపైసా కూడా భృతి ఇయ్యలేదన్నారు. 25 వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి 55 వేల పోస్టులు భర్తీ చేసుకున్నట్లు ప్రచారం చేసుకున్నరు,
ఇప్పటికీ రాష్ట్రంలోని అన్ని శాఖల్లో 2 లక్షలకుపైగా ఖాళీలున్నాయన్నారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను గల్లా పట్టి నిలదీయండని, టీచర్ల, ఉద్యోగుల 2023 జూలై నుంచి పీఆర్సీ పెండింగ్ లోనే ఉందని, పెండింగ్ లో ఉన్న 5 డీఏలన్నీ ఇస్తామని ఇయ్యలేదని, గల్లాపట్టి కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు.

అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు రేవంత్ రెడ్డి సహా కాంగ్రెసోళ్లు తమకు ఓటేసి గెలిపిస్తే 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అబద్దపు హామీలతో గద్దెనెక్కారని కేంద్ర మంత్రి సంజయ్ అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున తొలి ఏడాదిలో రాష్ట్రంలో 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి లబ్దిదారులతో గృహ ప్రవేశం చేయిస్తామని హామీ ఇచ్చారని, బడ్జెట్ లో రూ. ఏడు వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు ప్రకటించారని, అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయినా ఒక్కటంటే ఒక్క ఇళ్లయినా కట్టించారా? అని ప్రశ్నించారు.
20 లక్షల మందికి రుణమాఫీ చేసినం… ఎన్నికలైపోంగనే పంద్రాగస్టులోపు మిగిలిన 20 లక్షల మందికి రుణమాఫీ చేస్తామని ప్రకటించిండ్రని, ఫలితాలొచ్చి 8 నెలలైనా ఇంతవరకు ఆ రైతులకు నయాపైసా రుణమాఫీ చేయలేదన్నారు. 6 గ్యారంటీలు, 66 హామీలను పూర్తిగా గాలికొదిలేసిండని దుయ్యబట్టారు.
మరోవైపు కాళేశ్వరం, డ్రగ్స్ కేసు, ఫార్ములా ఈ రేస్ స్కాం కేసులో ఇదిగో అరెస్ట్.. .అదిగో అరెస్ట్ అంటూ మీడియాలో వార్తలు రాయించుకుంటూ కాలయాపన చేయడం తప్ప కాంగ్రెస్ సాధించిందేమిలేదన్నారు. బీఆర్ఎస్ చేసిన స్కాంలు… ఢిల్లీలోని కాంగ్రెస్ నేతలకు ఏటీఎంలాగా మారాయని, ఒక్క స్కాం బయటకు వస్తే.. ఢిల్లీ పెద్దలకు రూ. వెయ్యి కోట్లకుపైగా పైసలు దండుకుంటున్నారన్నారు.
మోసాల కాంగ్రెస్ కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు కె వెంకటరమణారెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, జిల్లా బీజేపీ అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్, రఘు నాథ్ వెరబెల్లి, రావుల రామనాథ్, చల్లా నారాయణ రెడ్డి, బీజేపీ నాయకులు, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.
- శెనార్తి మీడియా, మంచిర్యాల :