Venky Multistarer Movies: సంక్రాంతి సందర్భంగా విడుదలైన తన చివరి చిత్రం ఘనవిజయం సాధించిన తర్వాత వెంకటేష్ కొంతకాలంగా తెరపై కనిపించలేదు. దాదాపు ఆరు నెలల గ్యాప్ తీసుకున్న ఆయన తదుపరి సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మధ్యలో వేరే వేరే కథనాలు, లీకులు వచ్చినా, అధికారిక సమాచారం లేకపోవడంతో ఫ్యాన్స్ నిరీక్షణలోనే ఉన్నారు.
ఇప్పుడు ఆ ఊహాగానాలకు స్వయంగా వెంకటేష్ తెరదించినట్టే అయింది. యుఎస్‌లో జరుగుతున్న నాట్స్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తన రాబోయే ప్రాజెక్టుల గురించి క్లారిటీ ఇచ్చారు. అందులో ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా ఉండబోతుందని వెల్లడించారు. షూటింగ్ డేట్లు వెల్లడించకపోయినా, ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి.
అంతేకాక, చిరంజీవి నటిస్తున్న మెగా 157 చిత్రంలో ఓ వినోదాత్మక పాత్రలో కనిపించనున్నట్టు చెప్పారు. ఇది కేవలం కెమెరా ముందు చిన్న పాత్రే అయినా, చక్కటి వినోదాన్ని అందించబోతోందని హింట్ ఇచ్చారు. ఇక తర్వాతి ప్రాజెక్ట్ గా, దృశ్యం 3 షూటింగ్ ముస్తాబవుతోంది. మీనాతో కలిసి మళ్లీ ఈ సీరీస్‌లో నటించబోతున్నట్లు స్పష్టంగా చెప్పారు.
అనిల్ రావిపూడితో కూడానూ మరోసారి చేతులు కలపబోతున్నట్టు చెప్పారు. సంక్రాంతికి విడుదలైన ఫన్నీ ఫ్యామిలీ డ్రామాకి సీక్వెల్ రాబోతుందన్న సంకేతాలు ఇచ్చారు. అయితే ఈ అనౌన్స్మెంట్‌లో అసలైన హైలైట్ – బాలకృష్ణతో కలిసి చేయబోయే సినిమా. ఇప్పటి వరకు వెంకటేష్, బాలయ్య స్క్రీన్ షేర్ చేసుకోలేదు. చిరంజీవితో కలిసి ప్రాజెక్ట్ ఉంటే, బాలయ్యతో కూడా భారీ ప్రాజెక్ట్ వస్తుండటంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం పెరిగింది. నాగార్జునతో కూడిన మల్టీస్టారర్‌పై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.
ఈ సమాచారం నేపథ్యంలో వెంకటేష్ అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు. ఇప్పటిదాకా గ్యాప్ ఉన్నా, ఇకపై వరుసగా సినిమాలతో అలరించబోతున్నట్లు స్పష్టం అయింది. త్రివిక్రమ్ ప్రాజెక్ట్తో పాటు దృశ్యం 3 కూడ బహుశా సమాంతరంగా షూటింగ్ జరగవచ్చనే టాక్ ఉంది. మూడు భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనే లక్ష్యంతో దృశ్యం 3కు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
మూవీల్లో ముందు రిలీజ్ అయ్యేది మెగా 157 కావచ్చు. చిరంజీవి–వెంకటేష్ కాంబోలో వస్తున్న అల్లరి అంశాలపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. వచ్చే నెల నుంచే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.