- ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీ ఆర్ ఎస్ అభ్యర్థిని ఉంచలేదు
- కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయం
- మంచిర్యాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
CM PROGRAM : బీ ఆర్ ఎస్ పార్టీ బీ జే పీకి పరోక్షంగా మద్దతు ఇస్తుందని, అందుకోసమే ఎం ఎల్ సీ ఎన్నికలలో బీ ఆర్ ఎస్ అభ్యర్థిని బరిలో ఉంచలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమ వారం మంచిర్యాల జిల్లా నస్పూర్ లో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పట్ట భద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క, టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి సీ ఎం మాట్లాడారు. ప్రధాన ప్రతి పక్షంగా ఉన్న బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఎం ఎల్ సీ ఎన్నికలలో ఏ పార్టీకి ఓట్లు వేస్తారని ఆయన ప్రశ్నించారు. రిజర్వేషన్లపై బీఆర్ఎస్, బిజెపి పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. గతంలో బీ ఆర్ ఎస్ చేపట్టిన సర్వే కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల జన గణన స్పష్టంగా ఉందని, కావాల్సుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
ఫోన్ టాపింగ్ కేసులో నిందితులైన ప్రభాకర్ రావు, పవన్ లను కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ భారత్ కు ఎప్పుడు తెస్తారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఫోన్ టాపింగ్ నిందితులపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని ప్రయత్నిస్తుంటే బిజెపి పరోక్షంగా బిఆర్ఎస్ కు మద్దతు ఇస్తుందని ఆరోపించారు. గొర్రెల స్కామ్ కేసు తో పాటు ఈ రేస్ స్కాం, ప్రాజెక్టుల కుంభకోణాల కేసు ఫైళ్లు అన్ని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) తీసుకెళ్లిందని, ఇప్పటి వరకు ఆ కేసులు ఏమయ్యాయో ప్రజలకు చెప్పాలన్నారు.

ప్రజలు బిఆర్ఎస్ కు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని, 7.50 లక్షల వేల కోట్ల అప్పులు చేస్తే 75 వేల కోట్లు ఇప్పటి వరకు వడ్డీ చెల్లించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురయ్యారన్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన పది నెలల్లోనే 15 వేల పోలీసు ఉద్యోగాలు, 6 వేల మెడికల్ సిబ్బందికి ఇలా 55,163 ఉద్యోగాలు వివిధ శాఖల్లో కల్పించామని, పట్టభద్రులకు, నిరుద్యోగుల కోసం ప్రభుత్వం పని చేస్తుందని, త్వరలోనే కొత్త కంపనీలు తీసుకువచ్చి పట్టభద్రులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఐటీఐలను ఏటీసీలుగా మార్చి నాణ్యత ప్రమాణాలు పెంపొందిస్తున్నామన్నారు.
కేంద్ర ప్రభుత్వం రైతులపై చొరవ చూపి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు అనుమతి ఇస్తే ఆదిలాబాద్ జిల్లాలో లక్షల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం అయ్యేటివని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోడీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం వదిలి కిషన్ రెడ్డికి, బండి సంజయ్ లకి ఉద్యోగాలిచ్చాడని, విద్యావంతులను, నిరుద్యోగులను పట్టించుకోని బీజేపీకి పట్టభద్రులను ఓటు అడిగే హక్కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల సంక్షేమం, అభివృద్దిపై దృష్టి సారించి ముందుకు వెళుతుందని, ఇవన్నీ నిజమేనని నమ్మితే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

పట్టభద్రుల ఎంఎల్ సీగా నరేందర్ రెడ్డిని గెలిపిస్తే నిరుద్యోగుల, పట్టభద్రుల తరుపున వారదిగా పని చేస్తారని, సమస్యలు పరిష్కరిస్తారని, నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎంఎల్ఏ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, బెల్లంపల్లి ఎంఎల్ఏ వినోద్ వెంకట స్వామి, చెన్నూర్ ఎంఎల్ఏ వివేక్ వెంకటస్వామి, ఖానాపూర్ ఎంఎల్ఏ వెడ్మ బొజ్జు, ఎం ఎల్ సీ దండె విఠల్, జనక్ ప్రసాద్, సత్యనారాయణ, ఆత్రం సుగుణ, వేణుగోపాల్, ఆదిలాబాద్ – నిజామాబాద్ – కరీంనగర్ – మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎంఎల్ సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల