- రేషన్ బియ్యం రవాణాలో అజాగ్రత్తలపై డీసీఎస్ఓ సీరియస్
DCSO VISIT : మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని తీగల్‌పహాడ్‌లో ఉన్న సివిల్ సప్లయిస్ మండల్ లెవల్ స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్‌ను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి (డీసీఎస్ఓ) బ్రహ్మరావు ఆదివారం అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్) రజితతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి రేషన్ బియ్యం తరలిస్తుండగా కొన్ని బస్తాలు తడిసినట్లు గుర్తించారు. లారీలో లోడ్ చేస్తూ ఉండగా తడిసిన సన్న బియ్యం బస్తాలను మళ్లీ ఎంఎల్ఎస్ పాయింట్‌కి తీసుకువచ్చి ఆరబోసిన బియ్యాన్ని వారు పరిశీలించారు.

హమాలీలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రవాణా సమయంలో టార్పాలిన్ కవర్లు వినియోగించకపోవడమే బియ్యం తడవడానికి కారణంగా తేలడంతో ఇకపై కాంట్రాక్టర్ పంపించే వాహనాలకు టార్పాలిన్ తప్పనిసరిగా వాడాలని, లారీ యాజమానులతో సమన్వయం చేసుకొని చర్యలు తీసుకోవాలని హమాలీలకు సూచించారు. సుమారు 30 క్వింటాళ్ల బియ్యం తడిశాయని, పూర్తిగా ఆరిన తర్వాతే రేషన్ షాపులకు పంపించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ తనిఖీలో ఎంఎల్ఎస్ పాయింట్ ఇంచార్జ్ శంకర్, డీఈఓ నాగరాజు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :