- చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు లేఖ
Divakar Rao: ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు లేఖ రాశారు. మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు అనేక సందర్భాల్లో అధికారుల సమక్షంలో ప్రభుత్వ పథకాల చెక్కులు, రేషన్ కార్డులు, సన్నబియ్యం వంటి వాటిని స్వయంగా పంపిణీ చేసి వార్తల్లోకి ఎక్కుతున్నారని తెలిపారు. దీంతో ప్రజల్లో చర్చ జరుగుతోందని, ఈ విధానం తప్పని స్పష్టం చేశారు.
ఆగస్టు 15న మంచిర్యాల గార్డెన్స్ లో కళ్యాణలక్ష్మి, పాదీ ముబారక్ చెక్కులను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే జూలై 24న షాదీ ఖానా హాలులో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం, ఏప్రిల్ 1న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా నిర్వహించబడినట్లు వివరించారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ నాయకులు పాల్గొంటున్నారని, రేషన్ షాపుల వద్ద కూడా వారి ప్లెక్సీలు పెట్టడం ప్రోటోకాల్‌కు విరుద్ధమని అన్నారు. ఇలాంటి సందర్భాల్లో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల
