- రొంపికుంటలో దంపతుల మోసం
- లబదిబోమంటున్న కుటుంబసభ్యులు
- ఒకే భూమిని ఇద్దరికి విక్రయించేందుకు అగ్రిమెంట్
- డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయకుండా బెదిరింపులు
- రూ. 30 లక్షల అప్పు తీసుకొని ఎగ్గొట్టిన వైనం
- హైమావతి ఇంటి ముందు బాధితుల వంటావార్పు
Fruad Couple:పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన గుమ్మడి హైమావతి–శ్రీనివాస్ దంపతులు తమ వద్ద నుంచి భూముల విక్రయం పేరుతో, అప్పు పేరుతో లక్షలాది రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా తమపైనే ఫిర్యాదులు చేస్తూ భయపెడుతున్నారని పలువురు బాధితులు ఆరోపించారు. రొంపికుంటోని గుమ్మడి హైమావతి ఇంటి ఎదుట శుక్రవారం పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. “మా డబ్బులు మాకు ఇప్పించండి… మాకు ప్రాణరక్షణతో పాటు న్యాయం చేయండి” అంటూ నినాదాలు చేశారు. ఇంటి ముందు వంటవార్పు చేస్తూ నిరసన తెలిపిన వారు, తమకు రావాల్సిన డబ్బులు, భూములు తిరిగి ఇవ్వకుంటే ఇక ప్రతిరోజూ ఇలాగే వంటవార్పు చేస్తూ నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఆస్తులను జప్తు చేసి అయినా బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులు, పోలీసులను డిమాండ్ చేశారు.
బాధితుల్లో ఒకరు మాట్లాడుతూ, గుమ్మడి శ్రీనివాస్ తన వద్ద మూడేళ్ల క్రితం రూ. 21 లక్షలు తీసుకుని పది గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి, ఆ భూమిని అప్పటికే మరొకరికి అమ్మి తనను మోసం చేశాడని ఆరోపించారు. కష్టపడి సంపాదించిన డబ్బులను తీసుకుని ఇలాంటి మోసాలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అంతేకాకుండా తమపై ఫిర్యాదులు చేయడం ద్వారా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కమాన్పూర్ మండలంలోని నాగారం గ్రామానికి చెందిన మాడిశెట్టి బాలకృష్ణ మాట్లాడుతూ, 2011లో తన వద్ద రూ.4 లక్షలు అప్పుగా తీసుకున్నా, ఈ రోజువరకు ఒక్క పైసా కూడా తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. వేముల కొమురయ్య మాట్లాడుతూ, 2013లో రూ.3.50 లక్షలు అప్పుగా తీసుకుని ఇప్పటికీ చెల్లించలేదని వివరించారు. ఎండీ అఫ్జల్ మాట్లాడుతూ, 2014లో రూ.2.50 లక్షలు అప్పు తీసుకుని ఇప్పటికీ చెల్లించకపోగా, బదులుగా రెండు గుంటల స్థలాన్ని రాసి ఇస్తానని చెప్పినా అది కూడా అమలు కాలేదని తెలిపారు.

కుటుంబ సభ్యులూ బాధితులే..
ఇక గుమ్మడి శ్రీనివాస్ కుటుంబ సభ్యులే శ్రీనివాస్ అక్రమాలను బహిర్గతం చేశారు. అతని సోదరుడు గుమ్మడి రామకృష్ణ మాట్లాడుతూ, రొంపికుంట గ్రామంలో తమకు ఉమ్మడి హక్కుగా ఉన్న ఏడు ఎకరాల భూమిని మౌఖికంగా సాగు చేసుకోవాలని అనుమతి ఇచ్చినా, తమ తల్లి పేరు మీద ఉన్న నలుగురు ఎకరాలు, తండ్రి పేరు మీద ఉన్న మూడు ఎకరాలను శ్రీనివాస్ అక్రమంగా తన పేరిట పట్టా చేసుకున్నారని ఆరోపించారు. తాము ఒడిశాలో నివసించడం వలన ఆలస్యంగా ఈ విషయం తెలిసిందని, దీనిపై ప్రశ్నించగా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే గుమ్మడి హైమావతి సోదరుడు కేంగువ మోహన్ కుమార్ మాట్లాడుతూ, తాము విజయనగరంలో ఉంటున్నామని, తమ కుటుంబానికి చెందిన విశాఖపట్నంలో 35 సెంట్ల భూమిని హైమావతి తన పేరిట అక్రమంగా పట్టా చేసుకుందని తెలిపారు. తమ కుటుంబ సభ్యులకు చెందకపోయే హక్కులను దక్కించుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మరెవరూ ఇలాంటివి ఎదుర్కొనకుండా ఉండేందుకు ఈ విషయాన్ని ప్రత్యేకంగా వచ్చి గ్రామస్తుల ముందు వెల్లడిస్తున్నామని తెలిపారు.
ఈ సంఘటనతో పెద్ద సంఖ్యలో గ్రామస్థులు అక్కడికి చేరుకుని బాధితులకు మద్దతుగా నిలిచారు. బాధితులు ఒకటే స్వరం వినిపించారు – “మాకు రావాల్సిన డబ్బులు, భూములు తిరిగి ఇవ్వండి… లేకపోతే న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు.”
-శెనార్తి మీడియా, పెద్దపల్లి
