treatment
treatment: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు చేస్తున్న జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి

Eye Camp : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంటి పరీక్షలు

Eye Camp : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మంచిర్యాల జిల్లా ప్రభుత్వ దవాఖాన(Govt Hospital)లో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించేందుకు సోమవారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(DMHO) డాక్టర్ హరిచంద్రారెడ్డి, హాస్పిటల్ సంచాలకులు డాక్టర్ యశ్వంత్ రావు, జిల్లా కంటి వైద్యాధికారి డాక్టర్ ఎస్ అనిత, నోడల్ ఆఫీసర్, ఉపవైద్యాధికారి డాక్టర్ భీష్మ, ఆర్‌ఎం‌ఓ(RMO) డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడారు .ఫిబ్రవరి 17 నుంచి మార్చి 5 వరకు ఈ వైద్య శిబిరం కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని ఎనిమిది ఆర్‌బీఎస్‌కే అంబులెన్స్‌ల ద్వారా ప్రతిరోజు 80 నుంచి 100 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేయిస్తున్నట్లు తెలిపారు. 2024లో మొదటి విడతలో 577 మంది, రెండో విడతలో 697 మంది విద్యార్థులను గుర్తించినట్లు వివరించారు. మొత్తం 164 రెసిడెన్షియల్ పాఠశాలలు, 568 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ఇందులో భాగంగా 1274 మందికి మళ్లీ పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కళ్లద్దాలు పంపిణీ చేయనున్నామని వెల్లడించారు.

మంచిర్యాల(Mancherial) మండలానికి చెందిన 86 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. పరీక్షల అనంతరం వారికి అవసరమైన కంటి అద్దాలు పంపిణీ చేయగా, ఇద్దరిని శస్త్రచికిత్సకు రిఫర్ చేశారు. విద్యార్థులతో పాటు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు కూడా శిబిరానికి హాజరయ్యారు. పరీక్షల అనంతరం విద్యార్థులను క్షేమంగా తిరిగి వారి పాఠశాలలకు చేరవేశారు.

జిల్లా విద్యాశాఖ, సంక్షేమ శాఖల సమన్వయంతో విద్యార్థులను తరలించి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ శిల్ప, డాక్టర్ చంద్రబాబు, శంకర్ భాస్కర్ రెడ్డి, బుక్క వెంకటేశ్వర్ (జిల్లా మాస్ మీడియా అధికారి) తదితరులు పాల్గొన్నారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *