- ప్రశ్నిస్తే అరెస్టులు.. కేసులు…
- పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్
RAMAGUNDAM EX-MLA : రామగుండం ఎన్టీపీసీలో 2400 మెగావాట్ల ప్రాజెక్టు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ప్రజలు లేకుండానే పోలీసుల పహారా మధ్య నిర్వహించారని రామగుండం మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆరోపించారు. బుధవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాభిప్రాయ సేకరణ వేళ ప్రశ్నించేందుకు వెళ్లిన తనను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ అంటే కేవలం అధికార పార్టీకే హక్కులా? ప్రతిపక్ష నేతలను మాట్లాడనివ్వకుండా అరెస్టులు చేయడమా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా, పోలీసు నిర్బంధంలో ఈ ప్రక్రియ కొనసాగించడం దుర్మార్గమన్నారు. ఇది రద్దుచేసి, మళ్లీ ప్రజల సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఎన్టీపీసీ ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన గ్రామస్తులు ఇప్పటికీ విద్య, ఉద్యోగ అవకాశాలు పొందలేదని, ఎన్టీపీసీ యాజమాన్యం భూ నిర్వాసితులను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేదని ఆరోపించారు. భూములు కోల్పోయిన వారికి తక్షణమే అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, రమణ రెడ్డి, గాధం విజయ, బాదె అంజలి, జెవి రాజు, అచ్చే వేణు, చల్లా రవీందర్ రెడ్డి, రాకం దామోదర్, నారాయణదాసు మారుతి, కొలిపాక శరణ్య, శ్రీవాణి, ముద్దసాని సంధ్యారెడ్డి, సట్టు శ్రీనివాస్, ఇరుగురాళ్ల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, గోదావరి ఖని :